Begin typing your search above and press return to search.

ఇద్దరు కుమార్తెలు చనిపోయిన రోజే.. కవలలు జననం!

By:  Tupaki Desk   |   21 Sep 2021 7:31 AM GMT
ఇద్దరు కుమార్తెలు చనిపోయిన రోజే.. కవలలు జననం!
X
ఆ దంపతులకు ఇద్దరు ఆడబిడ్డలు పుట్టారు. ఇద్దర్నీ అల్లారుముద్దుగా పెంచుకున్నారు. పిల్లలతో కలిసి రామయ్యదర్శనానికి పడవలో బయలుదేరారు. పాపికొండలు అందాలను తిలకిస్తూ.. పిల్లలకు చూపిస్తూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఇంతలో ఊహించని ఉపద్రవం. గోదావరి ఉధృతికి వారు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోంది. ఆ ఘోరప్రమాదంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటివరకు తమ జీవీతాల్లో వెలుగులు నింపిన చిన్నారులు చనిపోవడంతో ఒక్కసారిగా చీకట్లు అమలుకున్నాయి. ఇది 2019 సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా, దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం వెనుక దాగున్న విషాదం.

చిన్నారుల మృతితో ఆ దంపతుల గర్భశోకం అంతాఇంతా కాదు. ఒక్కసారిగా ఇద్దరూ ఒంటరివారయ్యారు. ఇలా రెండేళ్లు గడిచాయి. ఇది దేవుడి వరమో లేక కాకతాళీయంగా జరిగిందో తెలియదుగానీ.. బిడ్డలు దూరమైన రోజే కవలల రూపంలో వాళ్లిద్దరూ తిరిగి జన్మించారు. వివరాల్లోకి వెళ్తే... 2019 సెప్టెంబర్ 15న విశాఖపట్నంలోని ఆరిలోవకు చెందిన అప్పలరాజు, భాగ్యలక్ష్మి వారి కుమార్తెలు గీతా వైష్ణవి, ధాత్రితో పాటు మరో ఏడుగురు కుటుంబ సభ్యులతో కలిసి రాయల్ వశిష్ట బోటులో రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం రామయ్య దర్శనానికి బయలుదేరారు. అయితే, ప్రమాదంలో దంపతులిద్దరూ ప్రాణాలతో బయటపడగా వారిద్దరి కుమార్తెలతో పాటు మిగిలిన బంధువులంతా ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్పలరాజు, భాగ్యలక్ష్మి తల్లడిల్లిపోయారు.

అప్పటికే ఇద్దరు పిల్లలు జన్మించడంతో భాగ్యల7మి అప్పటికే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు. మరోసారి పిల్లల్ని కనాలనే కోరికతో డాక్టర్లను సంప్రదించారు. ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టే అవకాశముందని చెప్పడంతో సుధాపద్మశ్రీ ఆస్పత్రిని సంప్రదించారు. కొద్దిరోజులకే భాగ్యలక్ష్మి గర్భం దాల్చారు. ఈ సెప్టెంబర్ 15వ తేదన ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. దీంతో వారి ఆనందానికి హద్దులు లేవు. బిడ్డలు దూరమైన రోజే మళ్లీ ఆడపిల్లలు పుట్టడంతో దేవుడే తమకు వరమిచ్చాడని వారు సంబరపడిపోతున్నారు. ఇద్దరు కుమార్తెలు చనిపోయిన రెండేళ్ల తరువాత సెప్టెంబర్‌ 15వ తేదీనే భాగ్యలక్ష్మి ఐవీఎఫ్‌ ద్వారా కవలలకు జన్మనిచ్చింది. ఆ కవలలు కూడా కుమార్తెలే కావడంతో ఆ భార్యాభర్తల ఆనందం వెల్లివిరిసింది.

వైద్యశాస్త్రంలో ఇదో అద్భుతమని డాక్టర్ సుధా పద్మశ్రీ తెలిపారు. గత ఏడాది అప్పలరాజు, భాగ్యలక్ష్మి దంపతులు తమను సంప్రదించారని, ఇద్దరికీ ధైర్యం చెప్పి చికిత్స ప్రారంభించామన్నారు. ఐతే ఈ ఏడాది అక్టోబర్ 20న డెలివరీ అవుతుందని చెప్పామన్నారు. ఐతే అనూహ్యంగా సెప్టెంబర్ 15న నొప్పులు రావడంతో వెంటనే సిజేరియన్ చేసి ప్రసవం చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ ఘటన నిజంగా అద్భుతమని, అసలు ఊహించని విధంగా పిల్లలు దూరమైన రోజే కవలు జన్మించడం సంతోషంగా ఉందని భాగ్యలక్ష్మి, అప్పలరాజు దంపతులు చెబుతున్నారు. దేవుడు తమకు అన్యాయం చేయలేదని, తమ పిల్లలను మళ్లీ తమ దగ్గరకే పంపాడని అంటున్నారు.