Begin typing your search above and press return to search.

శ్రీశైలానికి వెళుతూ ఒక కారు.. తిరిగి వస్తూ మరోకారు ఢీ.. ఏడుగురు మృతి

By:  Tupaki Desk   |   24 July 2021 3:48 AM GMT
శ్రీశైలానికి వెళుతూ ఒక కారు.. తిరిగి వస్తూ మరోకారు ఢీ.. ఏడుగురు మృతి
X
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైనప్పటికీ.. అలాంటి ప్రమాదాలకు మించిన దారుణ రోడ్డు ప్రమాదం ఒకటి తాజాగా చోటు చేసుకుంది. ఈ శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళుతున్న కారు ఒకటి.. మల్లన్నదర్శనం ముగించుకొని తిరిగి వస్తున్న మరో కారు..ఎదురెదురుగా.. అతి వేగంగా ఢీ కొన్న ఉదంతంలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. జరిగిన ప్రమాదం ఎంత దారుణంగా ఉందంటే.. మృతదేహాలు కారులో నుంచి విసురుగా బయటకు వచ్చి.. ప్రమాద స్థలానికి అల్లంత దూరాన పడిపోవటం చూస్తే.. షాక్ తినాల్సిందే. ఈ ప్రమాదంలో మరణించిన ఏడుగురు హైదరాబాద్ కు చెందిన వారే కావటం మరో విషాదం.

హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం పిరట్వాన్ పల్లి - చెన్నారం గేటు మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళుతున్న కారులో 30 ఏళ్ల శివకుమార్.. అతడి తల్లి సుబ్బలక్ష్మి.. లవమూర్తి.. అతడి కుమారుడు వెంటకరమణమూర్తి మృత్యువాత పడ్డారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారులో వంశీ.. వెంకటేశ్.. కార్తీక్ లు మరణించారు. నరేశ్ అనే యువకుడు గాయపడగా.. అతడికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.

ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోడీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రుడి కుటుంబానికి రూ.50 వేలు పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం ఇరు వాహనాల అతి వేగమనే చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీ కొట్టినట్లు చెబుతున్నారు. ప్రమాదం చోటు చేసుకున్న వేళలో.. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వస్తూ అదుపు తప్పినట్లుగా చెబుతున్నారు. కార్ల వేగం చాలా ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. దీనికితోడు రెండు కార్లలో ప్రయాణిస్తున్న వారిలో ఎవరూ సీటు బెల్టు పెట్టుకోలేదని చెబుతున్నారు.

రెండు కార్లలోనూ ఎయిర్ బెలూన్లు ఉన్నప్పటికి తెరుచుకోలేదని.. ప్రమాద తీవ్రతతో కొన్ని మృతదేహాలు రోడ్డు మీదకు విసురుగా పడిపోతే.. మరికొందరు మాత్రం కారులోనే ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసుకురావటానికి పోలీసులకు గంటన్నర సమయం పట్టినట్లుగా చెబుతున్నారు.ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి.. ఘటనా స్థలానికి చేరుకోవాలని.. బాధితుల్ని ఆదుకోవాలని.. సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆదేశించారు. ఆయన స్పందించి.. అధికారులతో సహాయక చర్యలు చేపట్టారు. కానీ.. ఘటనాస్థలంలోనే రెండు కార్లలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మినహా మిగిలిన వారంతా మరణించటంతో విషాద వాతావరణం చోటు చేసుకుంది.

శ్రీశైలం నుంచి హైదరాబాద్ వస్తున్న కారులో ప్రయాణిస్తున్న వారిలో వెంకట్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని నిజాం పేటకు చెందిన వారు. అతడు స్నేహితులతో కలిసి శ్రీశైలం వెళ్లాడు. ఇంట్లో వారికి సమాచారం ఇవ్వకుండా వెళ్లిన అతడు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకొని షాక్ కు గురయ్యారు. ఈ ప్రమాదంలో మరణించిన మరో యువకుడు వంధీ యూత్ కాంగ్రెస్ నాయకుడు. శ్రీశైలం నుంచి తిరిగి వస్తూ ప్రమాదానికి గురైన కారులోని వారంతా ఇంటర్ లో ఒకే కాలేజీలో చదివారు. అందరూ కలిసి గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి శ్రీశైలం వెళ్లి శుక్రవారం మధ్యాహ్నం తిరిగి వస్తున్న వేళ.. ప్రమాదానికి లోనయ్యారు. ఈ కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు మరణించారు.

ఈ ప్రమాదానికి కారణమైన కారులో ప్రయాణిస్తున్న శివకుమార్ ప్యారడైజ్ హోటల్ లో షిఫ్ట్ మేనేజర్ గా పని చేస్తున్నారు. పెళ్లై.. విడాకులు తీసుకున్న అతడు మరో పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మొక్కు తీర్చుకోవటానికి శ్రీశైలం వెళ్లే క్రమంలో ఘోర ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. నిజానికి అతను ప్రయాణిస్తున్న కారు తాను పని చేస్తున్న హోటల్ లో పని చేసే భాస్కర్ వద్ద తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం భాస్కర్ ప్రయాణం శనివారం జరగాల్సి ఉంది. అనుకోకుండా ఒక రోజు ముందే బయలుదేరి వెళ్లినట్లుగా చెబుతున్నారు.