Begin typing your search above and press return to search.

సారీ తప్పు మాదే..! ఇండియాకు ట్విట్టర్​ క్షమాపణలు

By:  Tupaki Desk   |   19 Nov 2020 9:45 AM IST
సారీ తప్పు మాదే..! ఇండియాకు ట్విట్టర్​ క్షమాపణలు
X
ఇటీవల ట్విట్టర్​ విడుదల చేసిన ఓ మ్యాప్​ తీవ్ర వివాదాస్పదమైంది. ఈ మ్యాప్​లో లడఖ్​ ప్రాంతం చైనాలో ఉన్నట్టు ఉంది. దీంతో ట్విట్టర్​పై భారత్​పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చాలా మంది భారతీయులు కూడా ట్విట్టర్​ తీరును తప్పుబట్టారు. దీంతో వెనక్కి తగ్గిన ట్విట్టర్​.. ఇండియాకు క్షమాపణ చెప్పింది. ఈ అంశంపై ట్విటర్ లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపినట్లు ఎంపీ, పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్‌పర్సన్ మీనాక్షి లేఖి మీడియాకు తెలిపారు.

నవంబర్ 30 నాటికి తమ తప్పును సరిదిద్దుకుంటామని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (వ్యక్తిగత డేటా రక్షణ)కి ట్విట్టర్​ వివరించింది. ‘ఇండియా మ్యాప్‌ను తప్పుగా జియో ట్యాగ్‌ చేసినందుకు క్షమాపణ కోరుతూ ట్విటర్‌ ఇండియా మాతృసంస్థ ట్విట్టర్‌ ఐఎన్‌సీ చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ డమైన్‌ కరియన్‌ అఫిడవిట్‌ రూపంలో లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. భారతీయుల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు కోరారని, నవంబర్ 30 నాటికి తప్పును సరిదిద్దుకుంటామని తెలిపారు’ మీనాక్షి లేఖి వెల్లడించారు.

లడఖ్‌ను చైనా భూభాగంలో చూపుతూ తప్పుగా జియో ట్యాగింగ్ చూపిన వ్యవహారంలో ట్విటర్‌కు అక్టోబర్‌లో పార్లమెంటరీ సంయుక్త కమిటీ నోటీసులు ఇచ్చింది. ఈ అంశంపై ట్విటర్‌ లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సమాచార పరిరక్షణ బిల్లుపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ముందు హాజరై ట్విటర్ ప్రతినిధులు ఇప్పటికే వివరణ ఇచ్చుకున్నారు. ట్విట్టర్​ చేసింది చాలా పెద్ద నేరమని.. ఇది భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడమేనని పార్లమెంటరీ సంయుక్త కమిటీ హెచ్చరించింది. దీంతో ట్విట్టర్​ ప్రతినిధులు క్షమాపణ కోరారు. తమ తప్పును సరిదిద్దుకుంటామని చెప్పారు.