Begin typing your search above and press return to search.

రూ.లక్ష కోట్లకు పైనే లాగేసి రైతుల ఖాతాల్లో వేసిన రూ.20 కోట్లతో గొప్పలా?

By:  Tupaki Desk   |   1 Jan 2022 10:20 AM IST
రూ.లక్ష కోట్లకు పైనే లాగేసి రైతుల ఖాతాల్లో వేసిన రూ.20 కోట్లతో గొప్పలా?
X
ఏడాది చివరి రోజున.. మరి కొన్ని గంటల్లో ఏడాది పూర్తి అవుతుందన్న వేళ.. కొత్త సంవత్సరానికి తీపి కబురు అందిస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. దాని సారాంశం ఏమంటే.. కొత్త సంవత్సరం తొలి రోజున దేశ వ్యాప్తంగా ఉన్న పది కోట్ల మంది రైతులకు భారత ప్రభుత్వం అందించే నగదు బదిలీ కార్యక్రమంలో భాగంగా రూ.20వేల కోట్ల మొత్తాన్నిబ్యాంకులో జమ చేసినట్లుగా పేర్కొంది. దీంతో.. ఏడాది మొదటి రోజున రైతుల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం ఇచ్చే నగదు బదిలీ జమ కానుంది.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా పదో ఇన్ స్టాల్ మెంట్ కింద ఈ నగదును రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగే కార్యక్రమంలో బదిలీ చేయనున్నారు. ఈ ప్రకటన బాగున్నప్పటికీ.. ఒక చేదు వాస్తవాన్ని మర్చిపోకూడదు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో పెట్రోల్.. డీజిల్ ధరల్ని భారీగా పెంచేయటం.. పెంచేసిన ధరల కారణంగా కేంద్రానికి వచ్చే ఆదాయం అంతా ఇంతా కాదు.

ఒక అంచనా ప్రకారం.. పెరిగిన పెట్రో ధరలతో కేంద్రానికి పన్ను ఆదాయం రూపంలో వచ్చిన మొత్తం రూ.లక్ష కోట్లకు పైనే వచ్చింది. అలా వచ్చిన మొత్తంలో రైతులకు నగదు బదిలీ కింద బ్యాంకుల్లోజమ చేస్తున్న రూ.20వేల కోట్లు లెక్కలోకి తీసుకోవాల్సిన అంశం కాదు. కానీ.. రైతులకు జమ చేస్తున్న మొత్తం గురించి గొప్పలు చెప్పుకునే కేంద్రం తీరు చూస్తే.. రైతుల విషయంలో తమకున్న కమిట్ మెంట్ తెలియజేసేలా చేస్తున్న హడావుడితోనే అభ్యంతరమంతా.

మరో రెండు.. మూడు నెలల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు వ్యవసాయచట్టాల్ని తీసుకురావటం ద్వారా జరిగిన డ్యామేజ్ ను పూడ్చుకునే క్రమంలో.. ఈ మధ్యనే మూడుచట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పిన కేంద్రం.. ఇప్పుడు కొత్త సంవత్సరం మొదటి రోజున రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్లు చెప్పటం ద్వారా.. రైతులకు తామిచ్చే ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని తెలియజేయాలన్నదే ప్లాన్ గా చెప్పాలి.

చిన్నా.. పెద్దా.. సామాన్యులు.. సంపన్నులు అన్న తేడా లేకుండా పెట్రో ధరల్ని భారీగా పెంచేయటం ద్వారా.. అందరి మీద భారం మోపి.. రైతుల ఖాతాలో వేస్తున్న రూ.20వేల కోట్లు చాలా చిన్న మొత్తమన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న రూ.20వేల కోట్ల గురించి చెప్పుకుంటున్న కేంద్రం.. పెట్రో ధరల మంటతో కేంద్రానికి వచ్చిన ఆదాయం ఎంతన్న విషయాన్ని కూడా ఇంతే గొప్పగా ప్రకటిస్తే.. బాగుంటుంది. మోడీ సర్కారు ఆ పని చేయగలరా? అన్నది ప్రశ్న.