Begin typing your search above and press return to search.

విశ్వక్ పై తెలంగాణా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన టీవీ9 యాంకర్..!

By:  Tupaki Desk   |   3 May 2022 12:49 PM GMT
విశ్వక్ పై తెలంగాణా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన టీవీ9 యాంకర్..!
X
టాలీవుడ్ యువ హీరో విశ్వ‌క్ సేన్‌ మరియు టీవీ9 యాంక‌ర్ దేవీ నాగ‌వ‌ల్లికి మ‌ధ్య జ‌రిగిన మాట‌ల యుద్ధం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే టీవీ9 ఛానల్ లైవ్ డిబేట్ లో ప‌రుష ప‌ద‌జాలాన్ని ఉప‌యోగించిన విశ్వక్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ యాంక‌ర్ దేవి స‌హా మ‌హిళా జ‌ర్న‌లిస్టుల ఫోరం సభ్యులు తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ ని మంగ‌ళ‌వారం క‌లిసి ఫిర్యాదు చేశారు.

యాంకర్ దేవి ఫిర్యాదుపై మినిస్టర్ తలసాని స్పందించారు. ఈ అంశాన్ని పరిశీలించి ప్ర‌భుత్వ ప‌రంగా తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ''విశ్వక్ సేన్ తన సినిమాను ఏదైతే ప్రమోషన్ చేయాలనుకుంటున్నారో దానికి కొన్ని పరిమితులుంటాయి. అంతే కానీ రోడ్డు పైన ఎవర్నీ వాళ్లని డిస్ట్రబ్ చేయడం కరెక్ట్ కాదు. నేను కూడా ఈ విష‌యంపై పోలీసుల‌తో మాట్లాడుతాను'' అని తలసాని అన్నారు

''టీవీ9 డిబేట్‌ ని కూడా నేను గ‌మ‌నించాను. అక్క‌డ బిహేవియ‌ర్ ప్రాప‌ర్‌ గా లేదు. ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని సీరియ‌స్‌ గా తీసుకుంటుంది. వారికే పాజిటివ్‌ గా ఉండాల‌నేం ఉండ‌దు క‌దా. నాగ‌వ‌ల్లీ గారు ఆ అంశాల‌ను మాట్లాడుతుంటే.. విశ్వ‌క్ మ‌రోలా స‌మాధానం చెబుతున్నాడు''

''ఓ ఆడ కూతుర్ని ఇలా అవ‌మానించ‌డం అనేది స‌భ్య స‌మాజంలో క‌రెక్ట్ కాదు. మ‌న కుటుంబంలోనూ త‌ల్లి, భార్య‌, పిల్ల‌లుంటారు. విశ్వ‌క్ సేన్ ప్ర‌వ‌ర్త‌న కరెక్ట్‌ గా లేదు. త‌ప్ప‌కుండా ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ నుంచి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు.. అలాగే పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి చ‌ర్య‌ల విష‌యంలోనూ నేను త‌ప్ప‌కుండా మాట్లాడుతాను''

''క్ష‌మాప‌ణ చెప్పే ప‌ద్ధ‌తులు కూడా వేరేగా ఉంటాయి. త‌ర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏదో లైట్‌ గా తీసుకునేలా మాట్లాడ‌టం క‌రెక్ట్ కాదు. మ‌హిళ‌కు గౌర‌వం ఇవ్వ‌కుండా మాట్లాడటం అనేది చాలా బాధాక‌ర‌మైన విష‌యం'' అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

ఇప్పటి వరకు మీడియా సోషల్ మీడియా వరకే పరిమితమైన ఈ వివాదం.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీసులు - ఫిల్మ్ ఫెడరేషన్ వరకూ చేరింది. మంత్రి సైతం ఈ ఇష్యూని తీసుకుంటామని ప్రకటించారు. మరి విశ్వక్ సేన్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.