Begin typing your search above and press return to search.

ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ముగిసిన శ్రావణి జీవితం?

By:  Tupaki Desk   |   17 Sept 2020 9:15 AM IST
ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ముగిసిన శ్రావణి జీవితం?
X

టీవీ సీరియల్ నటి శ్రావణి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మూడో వ్యక్తి ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి పోలీసులకు లొంగిపోయారు. ఈ క్రమంలోనే ఆదివారం ప్రెస్ మీట్ లో దేవరాజ్ ను ఏ3గా చెప్పిన పోలీసులు తాజా విచారణలో దేవరాజే ఏ1గా రిపోర్టు మార్చారు. దానికి కారణం కూడా తేల్చారు.

శ్రావణి ఆత్మహత్యకు ముందు చివరి కాల్ దేవరాజ్ తో మాట్లాడిందని పోలీసులు గుర్తించారు. ఆ కాల్ లో తనను పెళ్లి చేసుకోవాలని శ్రావణి ఒత్తిడి తెచ్చింది. పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినా దేవరాజ్ పట్టించుకోలేదు. దీంతో శ్రావణి సూసైడ్ చేసుకుంది. అందుకే తాజా రిమాండ్ రిపోర్టులో ఏ1గా దేవరాజ్ ను పేర్కొన్నారు. సాయి, అశోక్ రెడ్డితో సంబంధాల వల్లే తాను శ్రావణిని పెళ్లి చేసుకోలేదని దేవరాజ్ పోలీసులకు తెలిపారు.

ఇక శ్రావణిని దేవరాజ్ కు దూరం చేయడానికి హింసించాడనే కారణంతో సాయికృష్ణను పోలీసులు ఏ2గా చేర్చారు. ఇక సినిమాల్లో అవకాశాల పేరుతో శ్రావణిని మభ్యపెట్టి, మోసం చేసినందుకు సినీ నిర్మాత అశోక్ రెడ్డిని మూడో నిందితుడిగా ఏ3గా పేర్కొన్నారు.శ్రావణికి ఆశచూపి అశోక్ రెడ్డి ఆమెతో సంబంధం ఏర్పరుచుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలిందని తెలిసింది.

8 నెలలుగా దేవరాజ్ కు దగ్గరైన శ్రావణిని చూసి అశోక్ రెడ్డి జీర్ణించుకోలేక సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తెచ్చి ఆమె మరణానికి కారణమయ్యారని గుర్తించారు. అయితే చివరి కాల్ లో దేవరాజ్ ను పెళ్లి చేసుకోమన్నా అతడు చేసుకోనన్నాడు. దీంతో ప్రత్యక్షంగా ఆమె సూసైడ్ కు దేవరాజ్ కారణమని ఏ1గా పోలీసులు అతడిని మార్చారు.

మొత్తంగా ముగ్గురి ట్రయాంగిల్ ప్రేమలో పాపం శ్రావణి బలైంది. సాయికృష్ణ, అశోక్ రెడ్డితో శ్రావణి బంధం కారణంగా దేవరాజ్ పెళ్లికి నో చెప్పాడు. దీంతో పాటు సాయికృష్ణ, అశోక్ రెడ్డి శ్రావణిని టార్చర్ పెట్టారు. ఈ ముగ్గురి కారణంగా శ్రావణి చనిపోయిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తేల్చారు.