Begin typing your search above and press return to search.

అమెరికా దిమ్మ‌తిరిగిపోయే ఆరోప‌ణ‌లు ఇవి

By:  Tupaki Desk   |   9 Jan 2017 3:44 PM GMT
అమెరికా దిమ్మ‌తిరిగిపోయే ఆరోప‌ణ‌లు ఇవి
X
త‌మ దేశంలో అమెరికా సైబర్‌ దాడులకు పాల్పడుతోందని టర్కీ దేశ విద్యుత్‌ శాఖ మంత్రి బేరత్‌ అల్‌ బైరక్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అగ్రరాజ్యం నిర్వహిస్తున్న విద్రోహ చర్యల ఫలితంగా వారం రోజుల నుంచి విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. దీంతో, ఇస్తాంబుల్‌ లోని మూడు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. పవర్‌ గ్రిడ్‌ వ్యవస్థ ధ్వంసం కావడం కారణంగానే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని ఆయన గత వారం ప్రకటించారు. తాజాగా - అమెరికా హ్యాకింగ్‌ కార్యకలాపాలకు పాల్పడటంతోనే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని స్థానిక మీడియా సంస్థతో తెలిపారు. విద్యుత్‌ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు చెప్పారు.

కాగా, గతేడాది జులై 15న టర్కీలో సైనిక తిరుగుబాటు చెలరేగింది. ఈ తిరుగుబాటులో 300 మంది మృతి చెందారు. 2100 మంది గాయపడ్డారు. తిరుగుబాటును అణిచివేయాలని ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగన్‌ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో, ప్రజలు వీధుల్లోకి చేరుకుని ప్రభుత్వంపై తిరుగుబాటుకు ప్రయత్నించిన సైనికులను చితకబాదారు. ఫలితంగా సైనిక తిరుగుబాటు విఫలమైంది. అయితే, ఈ తిరుగుబాటు వెనుక అమెరికాలో ప్రవాసముంటున్న మత గురువు ఫెతుల్లా గులెన్‌ హస్తముందని ఎర్డోగన్‌ అనుమానిస్తున్నారు. గులెన్‌ను విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని అమెరికాను కోరారు. ఎర్డోగన్‌ విజ్ఞాపనలను ఒబామా సర్కార్‌ తిరస్కరించింది. దీంతో, దేశ సమాచారాన్ని హ్యాక్‌ చేసేందుకు అమెరికా కుట్ర పన్నిందని ఎర్డోగన్‌ సర్కార్‌ అనుమానిస్తున్నది.

ఇదిలాఉండ‌గా...చైనా సైనికులు హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారని అమెరికా చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్టు చైనా రక్షణ శాఖ ప్రకటించింది. గూఢచర్య కార్యకలాపాలు నిర్వహించాల్సిన అవసరం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి లేదని పేర్కొంది. తమ సైనికులు హ్యాకింగ్‌కు పాల్పడినట్టు అమెరికా దగ్గర ఆధారాలుంటే చూపాలని సవాల్‌ విసిరింది. కాగా, హైదియన్‌ జిల్లాలోని హోటళ్లలో గదులు అద్దెకు తీసుకుని చైనా సైనికులు గూఢచర్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు వాషింగ్టన్‌ మీడియా సంస్థ ఓ ఆర్టికల్‌ను ప్రచురించింది. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ఇకనైనా మానుకోవాలని అమెరికాకు హితవు పలికింది. హ్యాకింగ్‌ కు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇలాంటి చౌకబారు, నేరపూరిత చర్యలకు పాల్పడాల్సిన అవసరం తమ సైనికులకు లేదని తెలిపింది. ఇతరుల వ్యక్తిగత కంప్యూటర్ల నుంచి సమాచారాన్ని దొంగిలించే అలవాటు అమెరికాకు ఉందని పేర్కొంది. ప్రిసమ్‌ గేట్‌ కుంభకోణంపై ప్రపంచ దేశాలకు వివరణ ఇవ్వాలని అమెరికాను డిమాండ్‌ చేసింది.

ఇదిలా ఉండగా, 2013లో ప్రజావేగు, నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ మాజీ అధికారి ఎడ్వార్డ్‌ స్నోడెన్‌ ప్రిస్మ్‌ గేట్‌ సీక్రెట్‌ కోడ్‌ ద్వారా కంప్యూట‌ర్ యూజర్స్‌ సమాచారాన్ని హ్యాక్‌ చేసే విధానాన్ని కనిపెట్టారు. వెరిజాన్‌ - ఆపిల్‌ - గూగుల్‌ - యాహూ - మైక్రోసాఫ్ట్‌ - ఫేస్‌ బుక్‌ వంటి ప్రముఖ ఇంటర్నెట్‌ సర్వీసుల నుంచి సమాచారాన్ని హ్యాక్‌ చేశారు. ప్రిస్మ్‌ గేట్‌ విధానం ద్వారా అమెరికా గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతోందని చైనా పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/