Begin typing your search above and press return to search.

పాపం తుమ్మల.. ఏంటి పరిస్థితి?

By:  Tupaki Desk   |   19 Dec 2019 7:51 AM GMT
పాపం తుమ్మల.. ఏంటి పరిస్థితి?
X
బెల్లం చుట్టే ఈగలు.. గెలిస్తే అధికారం.. ఓడితే అంతే సంగతులు.. ఒకప్పుడు రాజకీయాలను ఏలిన తుమ్మల పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైందట.. 2014లో తెలంగాణ తొలి ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా నుంచి మంత్రి అయ్యి చక్రంతిప్పిన తుమ్మల 2018లో ఓడిపోయారు. కేసీఆర్ కు అనుంగ అనుచరుడిగా ఉన్న ఆయనను ఇప్పుడు పట్టించుకునే వారే కరువయ్యారట..

కేసీఆర్ రెండో సారి అధికారంలోకి రాగానే సీనియర్లను పక్కనపెట్టేశారు. తనకు సన్నిహితులైన నాయిని, కడియం, తుమ్మల, వేణుగోపాల చారి, స్వామిగౌడ్, మధుసూదనాచారి , జూపల్లి సహా అందరికీ ఎలాంటి పదవులు ఇవ్వకుండా రెస్ట్ ఇచ్చేశారు.

ఇక తుమ్మలపై గెలిచిన పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కారెక్కడంతో తుమ్మలకు కష్టాలు మొదలయ్యాయి. ఆది నుంచి గులాబీ పార్టీ నుంచి ఉన్న టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పక్కనపెట్టి కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికే కందాల పదవులు, పోస్టులు, అధికారం ఇచ్చేస్తున్నారు. దీంతో తుమ్మల వర్గం రగిలిపోతోంది. ఇప్పటికే ఈ తుమ్మల, కందాల అనుచరుల మధ్య గొడవల్లో పోలీసులు తుమ్మల వర్గానికి చెందిన 11మంది టీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టారు. కందల వర్గాన్ని వదిలేమడంతో తుమ్మల రగిలిపోతున్నారు..

దీంతో కడుపు మండిన తుమ్మల ‘తప్పుడు కేసులు పెట్టి పార్టీకి నష్టం తేవద్దు.. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వంలో అరాచకం సృష్టించవద్దు’ అని పోలీసులను, అధికారులను హెచ్చరించారు. కేసీఆర్ కు దీనిపై ఫిర్యాదు చేయడానికి కూడా తుమ్మలకు ధైర్యం రావడం లేదట.. ఇప్పటికే సీనియర్లను పక్కనపెట్టడం.. కొత్తవారిని ప్రోత్సహిస్తున్నకేసీఆర్ ను ఏమీ అనలేని పరిస్థితి తుమ్మలదీ.. అందుకే ఇలా వేధాంత ధోరణిలో బాధపడడం తప్పా తుమ్మల ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఖమ్మం రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.