Begin typing your search above and press return to search.

ట్రంప్ దాడులు టెర్రరిస్టులకు మద్దతుగానా..!!

By:  Tupaki Desk   |   7 April 2017 11:50 AM GMT
ట్రంప్ దాడులు టెర్రరిస్టులకు మద్దతుగానా..!!
X
సిరియా ప్రభుత్వం అమాయకులపై రసాయన దాడులకు దిగిందని ఆరోపిస్తూ సిరియాకు చెందిన వైమానిక స్థావరంపై ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ప్రత్యక్ష దాడులకు దిగిన సంగతి తెలిసిందే. సిరియాలో బోలెడు వైమానిక స్థావరాలున్నప్పటికీ ఐఎస్ఐఎస్ తీవ్రవాదులను తుదముట్టించడంలో కీలక పాత్రపోషించే అసద్ అల్ బషర్ వైమానిక స్థావరం ప్రధానమైనది. అమెరికా సేనలు ఇప్పుడు ఈ స్థావరాన్నే నాశనం చేశాయి. మధ్యధరా సముద్రంలోని షిప్ నుంచి సుమారు 60 తోమహాక్ క్షిపణులను ప్రయోగించి ఈ వైమానిక స్థావరాన్ని అమెరికా నాశనం చేయడంతో ట్రంప్ వైఖరిని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. రష్యాపై కోపంతో ఉగ్రవాదులకు మద్దతుగా బషర్ ప్రభత్వ విమానస్థావరంపై దాడిచేసినట్లు అనుమానిస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ అనుమతి లేకుండా ట్రంప్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని దాడులు చేయడంతో అమెరికాలోనూ ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అమెరికా ఏదైనా దేశంపై లేదా విదేశాల్లోని ఏదైనా ప్రాంతంపై దాడి చేయాలంటూ సైనికులకు ఆదేశాలు ఇవ్వాలంటే అధ్యక్షుడు ముందుకు అమెరికన్ కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో వివిధ దేశాలపై అదేతీరును అనుసరించారు. ఆఖరుకు ఒసామా బిన్ లాడెన్ పై ప్రత్యక్ష ఆపరేషన్ కు కూడా అదే విధానాన్ని అనుసరించారు. ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం కాంగ్రెస్ ను సంప్రదించకుండానే నేరుగా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు... సిరియాలోని అల్ బషర్ వైమానికి స్థావరాలపై దాడులు చేయాలని హిల్లరీ వ్యాఖ్యానించిన ఒక్క రోజులోనే ట్రంప్ దాడులు చేయించారు.

ట్రంప్ చ‌ర్య‌పై హవాయిన్‌ ప్రాంతం నుంచి అమెరికా కాంగ్రెస్‌ కు ఎంపికైన తొలి హిందూ మహిళ - డెమొక్రాట్‌ తులసీ గబార్డ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా నిర్లక్ష్యపూరితంగా చేశార‌ని అన్నారు. ఈ దాడులు జ‌రిపితే త‌ద‌నంత‌రం జ‌రిగే ప‌రిణామాలపై ఎవ‌రినీ సంప్ర‌దించ‌కుండానే డొనాల్డ్ ట్రంప్ ఈ చ‌ర్య‌కు దిగార‌ని అన్నారు. అసలు ఇటీవ‌ల‌ సిరియాలో జరిగింది ర‌సాయ‌న‌ దాడులా? కాదా? అని కూడా నిర్ధారించుకోకుండానే క్షిప‌ణిదాడులు నిర్వ‌హించార‌ని విమ‌ర్శించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఈ పని త‌న‌కు ఎంతో బాధను, ఆగ్రహాన్ని కలిగించిందని చెప్పారు. ఈ చ‌ర్య అల్‌ఖైదా ఉగ్ర సంస్థ‌ను మరింత బలోపేతం చేసేలా ఉంద‌ని అన్నారు. సిరియాలో ఎంతో మంది శ‌రణార్థులుగా మారే ప‌రిస్థితులు తెచ్చార‌ని అన్నారు. అంతేగాక‌, అమెరికా, రష్యా మధ్య అణుయుద్ధం కూడా జరిగే అవకాశం ఉంద‌ని తులసీ గబార్డ్ అన్నారు.

కాగా ఈ దాడిని ప్రస్తుతానికి సిరియాకు అండగా ఉన్న రష్యా - ఇరాన్‌ లు ఖండించాయి. మరోవైపు అమెరికా తన దాడులను సమర్థించుకుంటోంది. రష్యా విఫలమైనందునే తాము రంగంలోకి దిగామంటూ అమెరికా అంటోంది. మొత్తానికి ట్రంప్ ఇప్పుడు రష్యాతో కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/