Begin typing your search above and press return to search.

పవన్ ది భజన పార్టీ అన్నదెవరంటే..?

By:  Tupaki Desk   |   9 March 2018 2:31 PM GMT
పవన్ ది భజన పార్టీ అన్నదెవరంటే..?
X
ఏదో ఆషా మాషీ గా దారినపోయే దానయ్య కామెంట్ చేస్తే వాటిని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. ఈ మాటలు అన్నది మరెవ్వరో కాదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధి, రాజకీయాల్లో ఎంతోసీనియారిటీ ఉన్న తులసిరెడ్డి. కాంగ్రెస్ లో ఉన్న మేధావి నాయకుల్లో ఆయనకూడా ఒకరు. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన కేవలం చంద్రబాబు నాయుడును భజన చేయడానికి మాత్రమే పుట్టిన పార్టీ అని ఆయన అంటున్నారు. ఆయనకు భజన చేయాలనే ముచ్చట అంత ఎక్కువగా ఉంటే గనుక.. ఎటూ సినిమా హీరోనే గనుక.. భజన పాటలు రాయించుకుని.. వాటికి ట్యూన్లు కట్టించుకుని.. చంద్రబాబు కోసం పాడుకోవాలట. అంతే తప్ప... రాజకీయ పార్టీ పెట్టడం ద్వారా ఆయన సాధించేది ఏమీ ఉండదని.. తులసిరెడ్డి హెచ్చరిస్తున్నారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకప్పటి సహచరుడిగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న తులసిరెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలను అన్నిటినీ వెల్లడించడం విశేషం. దేశవ్యాప్తంగా ఇప్పుడు నరేంద్రమోడీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అంటున్న తులసిరెడ్డి.. నరేంద్ర మోడీ పాలన అనేది ఒక గాలిబుడగ లాంటిదన్నట్లుగా తేల్చిపారేయడం విశేషం.

వైఎస్ తో తనకు మంచి అనుబంధం ఉండేదని చెప్పుకుంటున్న తులసిరెడ్డి.. ఎన్టీఆర్ ను మాత్రం యుగపురుషుడిగా కీర్తిస్తున్నారు. ఆయనకు నిజాయితీకి నిలువుటద్దం అనికూడా సర్టిఫై చేసేశారు.

అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. మాత్రం తులసిరెడ్డి చెప్పలేకపోతుండడం విశేషం. విభజన తర్వాత.. రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా దారుణంగా దెబ్బతిన్నదని.. ప్రత్యేకహోదా ను రాష్ట్రానికి ఇచ్చే విషయంలో కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని తెలుగుదేశం కలిసి ఆడుతున్న డ్రామాలను ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే గనుక.. ప్రత్యేక హోదా రాష్ట్రానికి తప్పకుండా వస్తుందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించగలిగితే గనుక.. నెమ్మదిగా రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆయన అంటున్నారు. చంద్రబాబు ఎన్డీయే నుంచి తప్పుకోకుండా.. రాజీనామాల పేరిట డ్రామా నడిపించడాన్ని ఆయన కొట్టి పారేస్తున్నారు.