Begin typing your search above and press return to search.

తులసి రెడ్డి సెటైర్ అదిరిపోయింది..

By:  Tupaki Desk   |   16 Jun 2016 11:17 AM GMT
తులసి రెడ్డి సెటైర్ అదిరిపోయింది..
X
కాంగ్రెస్ నేతలంటే విమర్శలకు పెట్టింది పేరు. కొందరు సుతిమెత్తగా కౌంటర్లేస్లే ఇంకొందరు ఘాటైన వ్యాఖ్యలు చేస్తుంటారు. మొత్తానికి తమ శత్రుపార్టీలను ఎండగటట్టడంలో మాత్రం వారు ఏమాత్రం వెనక్కు తగ్గరు. తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి - మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని - రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం పెంచిన వ్యాట్ లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ఆయన మోడీ ప్రభుత్వంతో అచ్చే దిన్ రావమేమే కానీ చచ్చే దిన్ వస్తోందని ఎద్దేవా చేశారు.

2019 ఎన్నికల్లో కేంద్రలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారం కోల్పోయి 'ముక్త భారత్' - టీడీపీ ప్రభుత్వం ఏపీలో అధికారం కోల్పోయి 'ముక్త ఆంధ్రా'గా మారక తప్పదని.. ప్రజలు 'అచ్చేదిన్ బదులు చచ్చేదిన్'లను చవిచూస్తున్నారని ఆయన అన్నారు. పెట్రోల్ - డీజిల్ ధరలు ఆరు వారాల్లో నాలుగు సార్లు పెంచడం దారుణమన్నారు. మన దేశ అవసరాలలో దాదాపు 75 శాతం వరకు పెట్రోలు - డీజిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2013లో అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ ముడి చమురు ధర 140 డాలర్లుగా ఉన్నప్పుడు దేశంలో పెట్రోలు ధర రూ.60, డీజిల్ ధర రూ.50 ఉండేదన్నారు. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 49.29 డాలర్లు ఉంది. ఆ ప్రకారం ఇక్కడ లీటర్ పెట్రోలు ధర రూ.22, డీజిల్ ధర రూ.18 గా ఉండాలని కానీ, మోదీ - చంద్రబాబుల జోడీ పాలనలో పెట్రోలు ధర రూ.70 - డీజిల్ ధర రూ.60లుగా ఉండటం విడ్డూరమన్నారు.

ఇందుకు కారణం కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య దళారీలుగా వ్యవహరించడమేనని విమర్శించారు. కేంద్రం ప్రభుత్వం పెట్రోలు - డీజిల్ పై ఆరుసార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. చంద్రబాబు ప్రభుత్వం 2015 మార్చి 1 నుంచి నాలుగు రూపాయల వ్యాట్ అదనంగా విధించి ప్రజలపై మరింత భారం మోపిందని ఆరోపించారు. దీని ద్వారా గత రెండేళ్లలో మోదీ - బాబు ప్రభుత్వాలు దాదాపు రూ.3 లక్షల కోట్లను ప్రజల నుంచి దోచుకున్నారని మండిపడ్డారు. మోదీ - బాబు ప్రభుత్వాలు అదనంగా విధించిన ఎక్సైజ్ సుంకాన్ని - వ్యాట్ లను ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.