Begin typing your search above and press return to search.

సీబీఐ విచార‌ణ‌కు నేను రెడీ...మ‌రి మీరు?

By:  Tupaki Desk   |   4 Jun 2018 5:33 PM GMT
సీబీఐ విచార‌ణ‌కు నేను రెడీ...మ‌రి మీరు?
X
టీటీడీ మాజీ ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు మ‌రోమారు మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ ద‌ఫా ఏకంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీటీడీలో జరిగే అవకతవకలపై సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ విచార‌ణ‌కు త‌ను సిద్ధ‌మేన‌ని - దీక్షితులు సిద్ధ‌మేనా అని ప్ర‌శ్నించారు. తన 24 సంవత్సరాల కాలంలో స్వామివారి సేవకే అంకితం అయ్యానని దీక్షితులు తెలిపారు. జేఈఓలుగా పనిచేసిన బాలసుబ్రమణ్యం - ధర్మా రెడ్డి - శ్రీనివాస రాజులు టీటీడీకి పట్టిన ఏలినాటి శని లాంటి వారని రమణ దీక్షుతులు ఆరోపించారు. బాలసుబ్రహ్మణ్యం హయాంలో వెయ్యికాళ్ళ మండపాన్ని కూల్చివేశారని, దాని వెనుక తనకు వ్య‌క్తిగ‌త లాభాపేక్ష ఉంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఎన్నో ఏళ్ల కిందట నిర్మించబడిన - సుందరమైన - అపురూపమైన వెయ్యికాళ్ల మండపాన్ని కాపాడాలి అని అనేక పర్యాయములు వినతి పత్రం ఇచ్చానన్నారు. తాను వ్యతిరేకిస్తున్నాను అని కక్షగట్టిన బాలసుబ్రహ్మణ్యం... ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న తన ఇంటిని కూడా కూల్చివేశారు అని రమణ దీక్షితులు ఆరోపించారు.

మాజీ జేఈఏ ధర్మారెడ్డి ఉద్యోగం కోసం క్రైస్తవ మతానికి మారాడ‌ని ర‌మ‌ణ‌దీక్షితులు ఆరోపించారు. ధర్మారెడ్డి ఉన్న సమయంలోనే తనపై రెండు సార్లు హత్యా ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ప్రతాపరుద్రుడు సమర్పించిన అత్యంత అమూల్యూమైన సంపద కోట‌లో ఉన్నాయని అందుకే ఆ కోట‌లో నిధుల కోసం తవ్వకాలు జరిగాయని పేర్కొన్నారు. ఈ అక్రమాలను బయట పెట్టినందుకే తనపై కక్ష గట్టిన అధికారులు - నాయకులు దుష్ప్ర‌చారం చేస్తున్నారని దీక్షితులు తెలిపారు. అనాదిగా సంక్రమించిన ఆస్తులు తనకు ఉన్నాయని..అక్రమంగా సంపాదించిన ఆస్తులు వంటివి లేవని స్పష్టం చేశారు. తనకు అక్రమ ఆస్తులు ఉన్నాయి అని కొందరు అధికారులు సోషల్ మీడియాలో కావాలనే ఆరోపణలు చేస్తున్నారని ర‌మ‌ణ దీక్షితులు వెల్ల‌డించారు. సీబీఐ విచార‌ణ‌కు తాను సిద్ధంగా ఉన్నానని రమణ దీక్షితులు పేర్కొన్నారు. అదేవిధంగా టీటీడీలో తప్పులు చేస్తున్న అధికారులు - అక్రమ తవ్వకాలపై - అవకతవకలపై సీబీఐ విచార‌ణ‌ చేయించాలని రమణ దీక్షితులు డిమాండ్ చేశారు.