Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌కు కౌంట‌ర్ ఇచ్చిన టీటీడీ ఈఓ

By:  Tupaki Desk   |   9 May 2017 6:11 AM GMT
ప‌వ‌న్‌కు కౌంట‌ర్ ఇచ్చిన టీటీడీ ఈఓ
X
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం నూతన కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా ఐఏఎస్ అధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్ నియామ‌కం తెలుగుదేశం ప్ర‌భుత్వాన్ని తీవ్ర ఇర‌కాటంలో పడేసిన సంగ‌తి తెలిసిందే. విపక్షాలే కాకుండా మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఉత్త‌రాది అధికారిని ఈఓగా నియ‌మించ‌డంపై మండిప‌డ్డారు. అయితే దీనిపై ఈఓ సింఘాల్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా ప‌నిచేస్తున్న త‌న‌కు తెలుగువారి గురించి పూర్తి అవ‌గాహ‌న ఉంద‌ని తెలిపారు. త‌న‌కు తెలుగు భాష వ‌చ్చ‌ని, భ‌క్తుల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా చూసుకోగ‌ల‌న‌ని సింఘాల్ తెలిపారు.

కాగా, శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ 25వ కార్యనిర్వహణాధికారిగా ప్ర‌స్తుత ఈఓ దొండపాటి సాంబశివరావు నుంచి సింఘాల్‌ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు వేదపండితులు వేదాశీర్వచనం పలికారు. తిరుమల, తిరుపతి జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్‌ తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, శ్రీవారి చిత్రపటాలను అందించారు. అనంతరం అన్నమయ్య భవనంలో వివిధ విభాగాధిపతులతో పరిచయ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తిరుమల లాంటి పర్యాటక క్షేత్రంలో ప్రతి అధికారీ ఉద్యోగేననీ, ఉద్యోగంలా కాకుండా యాత్రికులకు సేవాభాగ్యంగా విధులు నిర్వహించాలనీ అన్నారు. త‌న‌కు కీల‌క ప‌ద‌వి అప్ప‌గించినందున యాత్రికులకు సంతృప్తికరమైన దర్శనాన్ని అందించడానికి కృషి చేస్తానని సింఘాల్‌ చెప్పారు.