Begin typing your search above and press return to search.

ఆ విషయంలో భక్తులకు షాకిచ్చిన టీటీడీ

By:  Tupaki Desk   |   29 Feb 2020 2:59 PM GMT
ఆ విషయంలో భక్తులకు షాకిచ్చిన టీటీడీ
X
టీటీడీ బోర్డు ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీలో పలు కీలకమైన సంస్కరణలు తెచ్చిన సంగతి తెలిసిందే. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నను దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డూ ఉచితంగా ఇవ్వాలని వైవీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. దీంతో పాటు భక్తుల సౌకర్యాల కోసం పలు మౌలిక సదుపాయాల కల్పనకు వైవీ ప్రణాళికలు రచించారు. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ బోర్డు ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలోని సమావేశమైన ట్రస్టు బోర్డు పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. 2020-21కు గాను రూ.3309 కోట్ల అంచనాలతో బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. దీంతోపాటు, భక్తులకు బోర్డు షాకిచ్చింది. అలిపిరి టోల్ గేట్ వద్ద టోల్ రుసుం పెంచాలని నిర్ణయించిన బోర్డు భక్తులకు షాకిచ్చింది.

ఇకపై, అలిపిరి టోల్ గేట్ దగ్గర ఫీజు పెంచాలని బోర్డు నిర్ణయించింది. గరుడ వారధి పిల్లర్లపై శ్రీవారి నామాల ముద్రణ నిలిపివేసినందున శ్రీవారి నామాలపై నుంచి వాహనాలు వెళ్లడం శ్రేయస్కరం కాదని కొందరు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భక్తుల విన్నపం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బూందిపోటులో అగ్నిప్రమాదాల నివారణకు 3.3 కోట్ల రూపాయలతో థర్మో ప్లూయిడ్స్ స్టవ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. జూ పార్కు వద్ద 14 కోట్లతో ప్రతిభావంతులకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని, రూ.16 కోట్ల ఖర్చుతో అలిపిరి-చెర్లోపల్లి రోడ్డు విస్తరణ పనులు చేపట్టబోతున్నామని తెలిపారు.

టీటీడీకి అనుబంధంగా ఉంటూ ఎంతో మంది పేదలకు వైద్యసేవలందిస్తోన్న`బర్డ్` ఆసుపత్రి అభివృద్ధికి 8.5 కోట్ల నిధులు కేటాయించామన్నారు. దీంతోపాటు, బర్డ్ ఆస్పత్రిలో అవసరమైనంతమంది ఉద్యోగాల నియామకానికి అనుమతులు జారీ చేశామన్నారు. అంతేకాకుండా, రూ. 34 కోట్లతో యస్వీ బధిర పాఠశాల నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపిందని వైవీ చెప్పారు. టిటిడి విజిలెన్స్ విభాగంలో సెక్యూరిటి గార్డుల నియామకానికి, టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాలలో 1300 సిసి కెమెరాలు ఏర్పాటుకు అనుమతించామని తెలిపారు. రూ.3.92 కోట్లతో చెన్నైలో అమ్మవారి ఆలయం నిర్మాణానికి నిధుల కేటాయింపునకు అమోదం తెలిపామని చెప్పారు. ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేయాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆలయాభివృద్ధికి నిధులు కేటాయించాలని బోర్డు నిర్ణయించిందని వైవీ చెప్పారు.