అచ్చు గుద్దినట్లు కేసీఆర్ మాదిరి తప్పు చేసిన కేటీఆర్

Tue Mar 21 2023 19:00:01 GMT+0530 (India Standard Time)

tspsc question paper leak case on Minister KTR

కొన్నిసందర్భాల్లో ఒప్పులు చేయకున్నా ఫర్లేదు తప్పులు చేయకుండా ఉండే సరి. కొందరి కారణంగా లాభం రాకున్నా ఫర్లేదు.. నష్టం జరగకుంటే అదే పదివేలు అన్న మాట వినిపిస్తుంటుంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల్ని చూసిన తర్వాత.. కేటీఆర్ కారణంగా లాభం సంగతి తర్వాత లేని నష్టం రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఒక పోలిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.ఆ మధ్యన ఫాంహౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని బీజేపీలో చేర్చేందుకు మంతనాలు జరిగాయంటూ ఆరోపణలు రావటం.. సైబరాబాద్ పోలీసుల ఎంట్రీ.. ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ సీన్లోకి వచ్చి.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మొదలు అన్ని రాష్ట్రాల హైకోర్టులకు తమ వద్ద ఉన్న ఆధారాల్ని పంపుతామంటూ ఆయన వీరావేశంతో చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత కాలంలో ఆయనకు ఎంతటి తిప్పలు తెచ్చి పెట్టాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ నోరు జారని ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకు భిన్నంగా ఆయన మాటలే ఆ కేసును బలహీనపర్చటమే కాదు.. గులాబీ బాస్ ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది.

సరిగ్గా అదే రీతిలో తాజాగా చోటు చేసుకోవటం.. దీనికి కారణం మంత్రి కేటీఆర్ కావటం విశేషం.  టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి కేటీఆర్  మాట్లాడుతూ.. లీకేజీ వ్యవహారంలో ఇద్దరు మాత్రమే నిందితులు అంటూ వ్యాఖ్యానించటం ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా మారింది. ఒకవైపు సిట్ విచారణ చేస్తున్న వేళ.. ఈ సంచలన ఉదంతంలో నిందితులు ఇద్దరే అంటూ మంత్రి కేటీఆర్ ఎలా తేల్చేస్తారు? అన్నది ప్రశ్నగా మారింది. కేసు ప్రాథమిక దశలో ఉన్న వేళలో మంత్రి కేటీఆర్.. ఈ వ్యవహారంలో ఇద్దరికి మాత్రమే ప్రమేయం ఉందన్న మాట తీర్పుగా మారి.. ఇదే విషయాన్ని న్యాయస్థానంలో సూటిగా ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ నోటి నుంచి వచ్చిన ఈ మాటకు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది.

ఎప్పుడూ మాటల్లో చిక్కని కేసీఆర్.. ఫాంహౌస్ ఎపిసోడ్ లో ఆవేశంతో మాట్లాడి ఆత్మరక్షణలో పడితే.. పేపర్ లీకేజీ విషయంలో మంత్రి కేటీఆర్.. తన తండ్రి మాదిరే ఆవేశానికి పోయి పేపర్ లీకేజీలో ఇద్దరు మాత్రమే నిందితులు అని చెప్పిన వైనం కేసీఆర్ సర్కారుకు తిప్పలుగా మారిందంటున్నారు. తండ్రి చేసిన తప్పునే కొడుకు కేటీఆర్ చేయటాన్ని పలువురు వేలెత్తి చూపుతున్నారు. రెండు కీలకమైన అంశాల్లో తండ్రీకొడుకులు ఇద్దరు ఒకేలాంటి తప్పు చేయటాన్ని పలువురు ఎత్తి చూపుతుండటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.