Begin typing your search above and press return to search.

ఈ ఆగస్టు 15న పుట్టే చిన్నారులందరికి టీఎస్ ఆర్టీసీ బంఫర్ ఆఫర్

By:  Tupaki Desk   |   9 Aug 2022 5:23 AM GMT
ఈ ఆగస్టు 15న పుట్టే చిన్నారులందరికి టీఎస్ ఆర్టీసీ బంఫర్ ఆఫర్
X
సైబరాబాద్ పోలీస్ బాస్ గా వ్యవహరించిన సజ్జన్నార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సైబరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టటానికి ముందు ఆయన మరెన్నో బాధత్యల్ని చేపట్టినప్పటికీ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ అత్యాచార కేసు విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఆయనకు పెద్ద ఎత్తున ఇమేజ్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత ఏమైందో ఏమో కానీ ఆయన్ను టీఎస్ ఆర్టీసీకి ఎండీగా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని తీసుకున్నారు.

తన లాంటి అధికారికి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా.. అక్కడ తన మార్క్ పని తీరును ప్రదర్శిస్తానన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపిస్తున్నారు. అజాదీ కా అమ్రతోత్సవ్ లో భాగంగా తెలంగాణ ఆర్టీసీ అనూహ్య ప్రకటనను చేపట్టింది. పన్నెండు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఒక బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. దీని ప్రకారం ఆగస్టు 15న పుట్టే చిన్నారులందరికి వారికి 12 ఏళ్లు వచ్చే వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది.

అంతేకాదు.. 75 ఏళ్లు పూర్తి చేసుకున్న పెద్ద వయస్కులకు ఈ నెల 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్ని వెల్లడించింది. అంతేకాదు టీ24 బస్ టికెట్ ను ఆగస్టు 15న రూ.75కు మాత్రమే అమ్ముతామన్నారు.

విడి రోజుల్లో ఈ టికెట్ ధర రూ.120 కావటం గమనార్హం. 'మంగళవారం నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లో ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని అలపిస్తాం. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు అన్ని బస్సులకు జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తాం. ఆర్టీసీ ఉద్యోగులంతా అమ్రతోత్సవవ్ బ్యాడ్జీలతోనే విధులకు హాజరు కావాల్సి ఉంటుంది' అంటూ తమ నిర్ణయాల్ని వెల్లడించారు.

దీంతో పాటు మరిన్ని ఆఫర్లను వెల్లడించారు. అందులో ముఖ్యమైనది ఆగస్టు 15న ఆర్టీసీ కార్గోలో ఒక కేజీ పార్సిల్ ను 75 కిలో మీటర్ల పాటు ఉచితంగా రవాణా చేస్తామన్నారు. టాప్ 75 ప్రరయాణికులకు ఒక ట్రిప్ టికెట్ ఉచితమని.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఆగస్టు 15న పుష్పక్ ఎయిర్ పోర్టు సర్వీస్ ను వినియోగించుకునే ప్రయాణికులు 75 శాతం ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది.

75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఆగస్టు 15 నుంచి 22 వరకు ఉచిత వైద్య పరీక్షలతో పాటు.. 75 ఏళ్ల లోపు వారికి రూ.750లతో వైద్య పరీక్షల ప్యాకేజీని ఏర్పాటు చేశారు. టీటీడీ ప్యాకేజీని వినియోగించుకొని ప్రయాణికులకు ఈ నెల 16 నుంచి 21 వరకు రూ.75 తగ్గిస్తామని పేర్కొన్నారు. మొత్తానికి ఆఫర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పక తప్పదు.