Begin typing your search above and press return to search.

మోడీకి బీపీ పెంచేందుకు త‌ల‌సానిని వాడుకుంటున్న కేసీఆర్‌!

By:  Tupaki Desk   |   25 May 2022 9:00 PM IST
మోడీకి బీపీ పెంచేందుకు త‌ల‌సానిని వాడుకుంటున్న కేసీఆర్‌!
X
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ స్నాతకోత్సవంలో పాల్గొనడంలో భాగంగా,  ప్రధాని మోడీ రేపు హైదరాబాద్ కు రానున్న సంగ‌తి తెలిసిందే. అధికారిక కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ప్ర‌ధాన‌మంత్రి వ‌స్తున్న‌ప్ప‌టికీ, ఈ కార్య‌క్ర‌మం పొలిటిక‌ల్ హీట్ రాజేసింది. ప్ర‌ధాన‌మంత్రి రాష్ట్రానికి వ‌స్తున్న స‌మ‌యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ క‌ర్ణాట‌క టూర్ పెట్టుకోవ‌డం చ‌ర్చ‌కు తెర‌లేపింది. ప్రధాని మోడీకి మొహం చూపించలేక సీఎం కేసీఆర్ కర్టాటక టూర్ కి వెళ్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఓబీసీ విభాగం జాతీయ అధ్య‌క్షుడు లక్ష్మణ్ మండిప‌డ్డారు. మ‌రోవైపు, ప్ర‌ధానమంత్రి పాల్గొనే కార్య‌క్ర‌మంలో త‌మ‌దైన శైలిలో మ‌రో షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధ‌మ‌య్యారు.

ప్ర‌ధాన‌మంత్రి పాల్గొనే కార్య‌క్ర‌మాల‌కు ముందే, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు వేరే కార్య‌క్ర‌మాల షెడ్యూల్ ఫిక్స్ అయినందున‌... ఆయ‌న ఐఎస్‌బీ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం లేద‌ని అధికారిక స‌మాచారం వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే, ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీనియ‌ర్ మంత్రి పాల్గొంటార‌ని తెలంగాణ స‌ర్కారు స‌మాచారం ఇచ్చింది. స‌హజంగానే ప్ర‌ధాని కార్య‌క్ర‌మంలో ఎవ‌రు పాల్గొన‌నున్నారు అనే ఆస‌క్తి నెల‌కొంటుంది. దీనికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌దైన శైలిలో ట్విస్ట్ ఇచ్చారు. ప‌శు సంవ‌ర్దక, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ను ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున పంపించేందుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నామినేట్ చేశారు. ఈ మేర‌కు ప్ర‌ధాన‌మంత్రి కార్య‌క్ర‌మాలు చూసే వ‌ర్గాల‌కు అధికారిక‌ స‌మాచారం అందించారు.

కాగా, కేంద్ర ప్ర‌భుత్వంపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించే టీఆర్ఎస్ నేత‌ల్లో ముందుండే మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ను ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి కార్య‌క్ర‌మానికే పంపించ‌డం ద్వారా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న రాజ‌కీయ చాణ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శించార‌ని అంటున్నారు. ఇదే కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై సౌంద‌ర‌రాజ‌న్ సైతం పాల్గొన‌నున్నారు. ఇటీవ‌ల గ‌వ‌ర్న్‌ర్‌పై సైతం మంత్రి త‌ల‌సాని ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అదే వేదిక‌పై గ‌వ‌ర్న‌ర్ ప‌క్క స్థానంలోనే మంత్రి త‌ల‌సాని ఆసీనులు కానున్నారు. ఇలా కీల‌క స‌మావేశానికి మంత్రి త‌త‌ల‌సానిని త‌మ ప్ర‌తినిధిగా పంప‌డం తెలంగాణ సీఎం కేసీఆర్ చాణ‌క్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు.