Begin typing your search above and press return to search.

కేటీఆర్ ప్రవచనాలు !

By:  Tupaki Desk   |   25 Oct 2022 11:43 AM IST
కేటీఆర్ ప్రవచనాలు !
X
మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా మంత్రి కేటీయార్ ఒక విచిత్రమైన వ్యాఖ్యచేశారు. అదేమిటంటే ఉపఎన్నికలో గరీబోళ్ళ పార్టీ టీఆర్ఎస్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేటీయార్ చెప్పుకుంటున్నట్లు నిజంగానే టీఆర్ఎస్ గరీబోళ్ళ పార్టీయేనా ? అన్న విషయమై చర్చ మొదలైంది. ఇక్కడ రెండు మూడు పాయింట్లను గమనిస్తే పార్టీ ఎంత గరీబుదో అర్ధమైపోతుంది.

అవేమిటంటే పార్టీకి వివిధ బ్యాంకుల్లో సుమారు రు. 900 కోట్ల నిధులున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని కేసీయారే స్వయంగా ప్రకటించారు. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చిన సమయంలో అధికారికంగా చెప్పిన లెక్కే ఇది. దీని సంగతి వదిలేస్తే జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండాలని అనుకుంటున్న కేసీయార్ తన అవసరాల కోసం ప్రత్యేకంగా ఒక విమానం కొనాలని అనుకుంటున్నారు.

కొత్తవిమానం కొనుగోలుకు రు. 90 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఇది కూడా దాదాపు అధికారికరమనే అనుకోవాలి. పార్టీ ఖాతాలో రు. 900 కోట్ల నిధులుండి, పార్టీ అవసరాల కోసం సొంతంగా రు. 90 కోట్లతో విమానం కొనబోతున్న పార్టీ గరీబోళ్ళ పార్టీ ఎలాగవుతుందో కేటీయారే చెప్పాలి. ఇవన్నీ సరిపోవన్నట్లు ఇక ఎన్నికల్లో గెలుపుకు అభ్యర్ధులు కోట్ల రూపాయలు ఖర్చులు చేస్తున్న విషయం బహిరంగ రహస్యం. కోట్ల రూపాయలు ఖర్చులు చేయగలిగిన నేతలున్న పార్టీ గరీబోళ్ళపార్టీ అని చెప్పుకుంటే ఎవరైనా నమ్ముతారా ?

గడచిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులు ఎంత ఖర్చుచేశారనేది అనవసరం. ఇపుడు జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి చేస్తున్న ఖర్చుఎంత ? టీఆర్ఎస్ పార్టీ ఓటుకు రు. 40 వేలు ఇస్తోందని, నేతలను మ్యానేజ్ చేసేందుకు కార్లు ఇస్తున్నట్లు, భారీ ప్యాకేజీలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజంగానే టీఆర్ఎస్ గరీబోళ్ళపార్టీనే అయితే ఇదంతా చేయగలుగుతుందా ? ఏదో ఎన్నికల ప్రచారంలో జనాల చెవిలో పువ్వులు పెడుతున్నామని అనుకుంటు ఏదో ఒకటి మాట్లాడేందుకు పనికొస్తుందంతే.