Begin typing your search above and press return to search.

మరో ఆరు ఆసుపత్రులపై చర్యల కత్తి ఝుళిపించిన కేసీఆర్

By:  Tupaki Desk   |   1 Jun 2021 7:30 AM GMT
మరో ఆరు ఆసుపత్రులపై చర్యల కత్తి ఝుళిపించిన కేసీఆర్
X
పెద్ద సారు సీన్లోకి రాక ముందు ఏం జరిగినా పట్టించుకునేటోళ్లు.. ఆరా తీసేటోళ్లు.. చర్యల కత్తి ఝుళిపించే వారు ఎవరూ ఉండే వారు కాదన్న మాట వినిపిస్తుంటుంది. ఒక్కోసారి కంప్లైంట్లు వచ్చినప్పుడు లెక్క తేడా ఉందన్న విషయాన్ని గుర్తించినా.. ఇదే నీకిచ్చే చిట్టచివరిగా వార్నింగ్ అంటారే కానీ.. చర్యలు తీసుకోరు. కానీ.. సీఎమ్మే సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇలాంటివి కుదరవు కదా? అందులోకి చూసిచూడనట్లుగా ఉండే కేసీఆర్.. కొన్నిసార్లు ఇట్టే సీరియస్ అయిపోతుంటారు. తాజాగా కరోనా ఎపిసోడ్ విషయంలో ఆయన మహా కోపంతో ఉన్నారని చెబుతారు.తనకు తాను స్వయంగా కరోనా బాధను అనుభవించటం.. దానికి తోడు గాంధీకి వెళ్లి.. అక్కడి రోగుల పరిస్థితిని కళ్లారా చూశాక మనసు కరగకుండా ఉంటుందా?

ఇది సరిపోదన్నట్లు సెకండ్ వేవ్ వేళ.. రాష్ట్రంలోని ప్రైవేటు దవాఖానాలు ఎలా వైద్యాన్ని అందించాయో.. ఎంతలా డబ్బులు గుంజాయో సిత్రం కళ్ల ముందు కనిపించటం.. వారి బాదుడు లీలలు మీడియాలో ఎప్పటికప్పుడు వార్తల రూపంలో రావటం తెలిసిందే. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న వేళ.. ప్రైవేటు ఆసుపత్రుల ఆరాచకాలు డైలీ బేసిస్ లో బయటకొచ్చాయి.

ఇంచుమించి అన్ని ఆసుపత్రులు కాసుల కక్కుర్తి తప్పించి.. మరింకేమీ తమకు ప్రాధాన్యత లేదన్నట్లుగా వ్యవహరించిన ఉదంతాలు కోకొల్లలు. అప్పుడున్న పరిస్థితుల్లో చర్యలు తీసుకుంటే.. వైద్యం అందించలేని పరిస్థితి. అందుకే.. దారుణాలకు పాల్పడిన ఆసుపత్రుల వివరాలు అందుబాటులోకి వచ్చినా.. తొందరపడి చర్యలు తీసుకోవటం లేదు. కాకుంటే.. హెచ్చరికలు జారీ చేశారు. తీరు మార్చుకోవాలని చెప్పారు.

ఇప్పుడు కేసుల తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టటం.. ప్రభుత్వ.. ప్రైవేటు ఆసుపత్రులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆసుపత్రుల లెక్క తేల్చే పనిలో పడింది. ఇందులో భాగంగా గడిచిన మూడు నాలుగు రోజులుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ప్రైవేటు ఆసుపత్రులకు షాకుల మీద షాకులు ఇస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

ఇప్పటికే పలు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు ఇవ్వటంతో పాటు.. కొన్ని ఆసుపత్రుల్లో కొవిడ్ సేవల్ని తక్షణమే నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో పెద్ద ఆసుపత్రులు మొదలు చిన్న ఆసుపత్రులు ఉన్నాయి. సోమవారం సైతం మరో ఆరు ఆసుపత్రుల్లో కొవిడ్ వైద్యం ఇవ్వొద్దంటూ కొరడా ఝుళిపించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మరికొన్ని ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

నోటీసులు అందుకున్న ఆసుపత్రులు 24 గంటల్లోపు స్పందించి వివరణ ఇవ్వాలన్నారు. ఒకవేళ ఆ విషయంలో నిర్లక్ష్యం చేస్తే వాటి లైసెన్సుల్ని రద్దు చేస్తామన్న భారీ వార్నింగ్ ఇచ్చేశారు. తాజాగా తెలంగాణలో కొవిడ్ వైద్య సేవల్ని నిలిపివేయాలని కోరుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఆ ఆరు ఆసుపత్రులు ఇవే.. ఇందులో మూడు హైదరాబాద్ కు చెందినవి ఉండగా.. వరంగల్ నగరానికి చెందినవి రెండు ఉండగా.. సంగారెడ్డికి చెందిన ప్రైవేటు ఆసుపత్రి ఒకటి ఉంది. అవేమంటే..

1. పద్మజ ఆసుపత్రి (కేపీహెచ్ బీ కాలనీ)
2. లైఫ్ లైన్ మెడిక్యూర్ (అల్వాల్)
3. టీ ఎక్స్ ఆసుపత్రి (ఉప్పల్)
4. మ్యాక్స్ కేర్ ఆసుపత్రి (హన్మకొండ)
5. లలిత ఆసుపత్రి (వరంగల్)
6. శ్రీ సాయి రాం ఆసుపత్రి (సంగారెడ్డి)