Begin typing your search above and press return to search.

కోర్టు వద్దన్నా ముందుకే! సాదాబైనామాలపై కేసీఆర్​ కీలకనిర్ణయం!

By:  Tupaki Desk   |   14 Nov 2020 5:20 PM IST
కోర్టు వద్దన్నా ముందుకే!  సాదాబైనామాలపై కేసీఆర్​ కీలకనిర్ణయం!
X
రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలు లేకుండా చేయాలని సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చి భూ సంబంధిత వివాదాలన్నింటికి చరమగీతం పాడనున్నారు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న సాదాబైనామా ఆస్తులను కూడా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అక్టోబరు 12న సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇప్పటివరకు ఇప్పటి వరకు 9 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కానీ ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు జోక్యం చేసుకున్నది. సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియను ఆపాలంటూ ఆదేశాలు జారీచేసింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ముందుకే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నది. సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం ఓ ఆర్డినెన్స్​ను తీసుకొచ్చింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ ఆర్డినెన్స్​ను మంత్రిమండలి ఆమోదించింది. ధరణి వెబ్‌ పోర్టల్‌ ద్వారా త్వరలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు అనుమతులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ భేటీలో ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు గురించి చర్చించారు. ఇప్పటికే వ్యవసాయ భూముల నమోదు జరుగుతోంది. రెవెన్యూ అధికారులు రైతుల వ్యవసాయభూములను ధరణి పోర్టల్​ లో నమోదు చేశారు. ఇకనుంచి ఆన్​లైన్​లోనే పారదర్శకంగా రిజిస్ట్రేషన్​ ప్రక్రియ కొనసాగనున్నది. ఈ ఆస్తుల నమోదుకు అనుమతులివ్వాలని, పాస్‌ పుస్తకాలు సైతం జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

కొత్త భూరికార్డుల హక్కుల (ఆర్వోఆర్‌) చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం లేకపోవడంతో 1971 ఆర్వోఆర్‌ చట్టంలోని క్లాజ్‌లను చేరుస్తూ ఆర్డినెన్స్‌ జారీకి రాష్ట్రమంత్రిమండలి ఆమోదం తెలిపింది. మొత్తం మీద సాదాబైనామాల క్రమబద్ధీకరణకు వీలుగా ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే గవర్నర్‌ తమిళిసై శుక్రవారం నుంచి శాసనసభ, మండలి సమావేశాలను ప్రొరోగ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం సాదాబైనామాల ఆర్డినెన్సేనని సమాచారం.