Begin typing your search above and press return to search.

కేసీఆర్ లో ఫైర్.. బీఆర్ఎస్ మంత్రుల్లో లేకపాయే..

By:  Tupaki Desk   |   8 Jan 2023 7:30 AM GMT
కేసీఆర్ లో ఫైర్.. బీఆర్ఎస్ మంత్రుల్లో లేకపాయే..
X
తెలంగాణలో చేసిన అభివృద్ధిని దేశమంతటా చేస్తానని కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మర్చారు. అందుకు ఈసీ కూడా ఆమోదం తెలపడంతో ఢిల్లీలో ఆడంబరంగా కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. ఆ తరువాత పలు సమావేశాల్లో తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మొదటిసారి తెలంగాణేతర పోటీ ఉంటుందని పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ కు చెందిన ఓ మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధ ప్రకటన చేశారు. కర్ణాటకలో బీఆర్ఎస్ పోటీ ఉండదని తేల్చి చెప్పారు. ఓ వైపు కేసీఆర్ ఢిల్లీలోని ఎర్రకోటపై జెండా ఎగురవేస్తానని ఆవేశ ప్రకటనలు చేస్తుంటే.. ఆ పార్టీకి చెందిన మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తే మొదట్లోనే బీఆర్ఎస్ వెనుకడుగు వేసిందా..? అన్న చర్చ సాగుతోంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలోని పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేయనుందని ఆ పార్టీ నేత కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కమిటీ వేశారు. సంక్రాంతి తరువాత అక్కడ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తానని తెలిపారు. అనంతరం మిగతా రాష్ట్రాల్లోనూ అధ్యక్షులను ప్రకటించి పార్టీ విస్తరిస్తామని పేర్కొన్నారు. అయితే కేసీఆర్ బీఆర్ఎస్ విస్తరణకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇతర నాయకులను సంప్రదిస్తూ వారి మద్దతు కూడగడుతున్నారు. కానీ మిగతా నాయకుల్లోమాత్రం ఆ ఫైర్ కనిపించడం లేదు.

ముఖ్యంగా బీఆర్ఎస్ లో నెంబర్ 2 గా ఉన్న కేటీఆర్ సైతం బీఆర్ఎస్ ను పట్టించుకోవడం లేదనే తెలుస్తోంది. ఆయన పార్టీ ఢిల్లీ కార్యాలయాన్ని ప్రారంభించినప్పుడు కనిపించలేదు. ఇటీవల ఏపీ నాయకులు జాయినింగ్ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. కొందరు ఈ విషయాన్ని అడిగితే ఇతర వాటికి కమిట్ అయ్యానని చెప్పారు. మరోవైపు ఆయన ట్విట్టర్ ఖాతాలోనూ బీఆర్ఎస్ ప్రచారాన్ని పెద్దగా చేయడం లేదు. దీంతో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంపై కేటీఆర్ వైఖరి స్పష్టంగా చెప్పడం లేదని కొందరు అంటున్నారు.

ఇక తాజాగా బీఆర్ఎస్ కు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బీఆర్ఎస్ పార్టీ కర్ణాటకలో పోటీ చేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. కానీ ఆ పార్టీకి చెందిన మంత్రి సత్యవతి రాథోడ్ మాత్రం కర్ణాటకలో బీఆర్ఎస్ పోటీ చేయదని అన్నారు. తాజాగా కర్ణాటకలోని కలబురిగిలో జరిగిన ఓ కార్యక్రమంలో సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్ణాటకలో బీఆర్ఎస్ పోటీ చేయదని తెలిపారు. ఇక్కడున్న జేడీఎస్ కు మద్దతు ఇస్తుందన్నారు. కుమార స్వామికి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తుందని అన్నారు.

అయితే మంత్రి సత్యవతి రాథోడ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ మాత్రం దానికి బీఆర్ఎస్ గా ఎందుకు మార్చారని అంటున్నారు. టీఆర్ఎస్ సీఎం గా కేసీఆర్ నేరుగా వెళ్లి ప్రచారం చేసినా ఆకట్టుకునేవారని అన్నారు. ఓ వైపు వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో ఎర్రకోటపై జెండా ఎగురవేస్తానని చెబుతున్న కేసీఆర్.. ఇలా ఇతర రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు మద్దతు ఇస్తుంటే బీఆర్ఎస్ ఎక్కడా కనిపించదని అంటున్నారు. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ప్రజలను ఏ విధంగా సముదాయిస్తారో చూడాలి.