Begin typing your search above and press return to search.

పల్లెకోడ్ తో కొండెక్కిన కేబినెట్ విస్తరణ

By:  Tupaki Desk   |   3 Jan 2019 5:00 AM GMT
పల్లెకోడ్ తో కొండెక్కిన కేబినెట్ విస్తరణ
X
తెలంగాణలో మంత్రి వర్గ ఏర్పాటుకు ఇప్పట్లో మోక్షం లభించేలా లేదు. ముందస్తు ఎన్నికలతో మొదలైన ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఊహించినట్టుగానే టీఆర్ ఎస్ అఖండ మెజార్టీతో మళ్లీ గద్దెనెక్కింది. రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు తోడుగా మహమూద్ అలీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం, మంత్రి వర్గ ఏర్పాటు ఉంటుందనుకున్నా మంచి రోజులు లేకపోవడంతో ముహూర్తం ముందుకు జరిగింది. సంక్రాంతి పండగ తర్వాత మంత్రి వర్గ ఏర్పాటు ఉంటుందని ఆశావహులు సీఎం కేసీఆర్ ను, టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా పలు రాష్ట్రాల్లో పర్యటించి వచ్చారు. మొత్తం మీద 20 రోజులుగా ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి, మరో మంత్రి ద్వారానే నడుస్తోంది.

సంక్రాంతి తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని భావించిన ఆశావహుల ఆశలపై పంచాయతీ ఎన్నికలు నీళ్లు చల్లాయి. జనవరి ఒకటో తేదీనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. మూడు విడతులుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అంటే ఈ నెల 30వ తేదీన ముగుస్తున్నాయి. అంటే ఇక ఫిబ్రవరిలోనే కేబినెట్ విస్తరణ ఉండనుంది. వంద శాతం పంచాయతీల్లో గులాబీ జెండా ఎగురాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్ ఆ బాధ్యతను ఎమ్మెల్యేల పై పెట్టారు. ఎన్నికల్లో వారి పనితీరు ప్రామాణికంగా మంత్రి పదవి లభించే అవకాశముండడంతో ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు.

ఏ విషయంలోనైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించే కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి ఆరు లేదా ఏడుగురు మంత్రులకు మాత్రమే చాన్స్ ఉంటుందని, మిగతా వ్యవహారం పార్లమెంట్ తర్వాతనేనని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలతో వారు కూడా ఫిబ్రవరిదాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మంత్రి వర్గం ఉన్నా లేకపోయినా పాలన సాఫీగా సాగుతుండడంతో ప్రజలు పట్టించుకోవడం లేదు. మొత్తం మీద మంత్రి వర్గ విస్తరణ ఈ నెలలో జరిగే అవకాశం లేదని స్పష్టమవుతోంది.