Begin typing your search above and press return to search.

దేవుడా! ఇలా అయితే..` స్ట్రెయిన్` ఆగేదెలా?

By:  Tupaki Desk   |   30 Dec 2020 3:07 PM GMT
దేవుడా!  ఇలా అయితే..` స్ట్రెయిన్` ఆగేదెలా?
X
దేశంలో క‌రోనాను త‌గ్గించేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్ర‌బుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నాయో అంద‌రికీ తెలిసిందే. ఆది లో ఈ మ‌హమ్మారిని గుర్తించేందుకు, కాంటాక్టుల‌ను క‌నిపెట్టేందుకు తీవ్ర ప్ర‌యాస ప‌డాల్సి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు క‌రోనా కొత్త రూపం.. స్ట్రెయిన్ బ్రిట‌న్‌లో వెలుగు చూసిన విష‌యం తెలిసిందే. క‌రోనాను మించిన వాయు వేగంతో స్ట్రెయిన్ వ్యాపిస్తుండ‌డంతో బ్రిట‌న్‌కు వెళ్లే విమానాల‌ను కేంద్రం ఇప్ప‌టికే ఆపు చేసింది. అయితే.. బ్రిట‌న్ నుంచి వ‌చ్చేవారు మాత్రం వ‌స్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో వీరి వ‌ల్ల దేశంలో స్ట్రెయిన్ విస్త‌రించ‌కుండా చూసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటోంది. కానీ, బ్రిట‌న్ నుంచి వ‌స్తున్న వారు స‌రైన వివ‌రాలు ఇవ్వ‌కుండా.. దోబూచులాడుతున్న నేప‌థ్యంలో అధికారులు, ప్ర‌భుత్వం కూడా `దేవుడా!` అంటూ త‌ల‌లు ప‌ట్టుకునే ప‌రిస్తితి ఏర్ప‌డింది.

క‌రోనా వ్యాప్తి విష‌యంలో కేంద్ర ప్ర‌బుత్వం తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. దేశంలో ఈ వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఈ ఏడాది జ‌న‌వ‌రిలోనే విదేశీ విమానాల‌ను నిలువ‌రించాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తులు వెళ్లాయి. అయితే.. అప్ప‌ట్లో కేంద్రం తాత్సారం చేసింది. దీంతో దేశ‌వ్యాప్తంగా వైర‌స్ వ్యాపించి ల‌క్ష మందికిపైగా ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ తీవ్రత నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామ‌ని భావిస్తున్న త‌రుణంలో బ్రిటన్‌ నుంచి భారత్‌కు కొత్త రకం వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. దీంతో గ‌త త‌ప్పును దృష్టిలో పెట్టుకున్న‌ కేంద్ర ప్రభుత్వం బ్రిట‌న్ నుంచి వచ్చే విమాన సర్వీసులను రద్దు చేసింది. అదేస‌మ‌యంలో న‌వంబ‌రు 25 నుంచి ఈ నెల 23 వరకు బ్రిట‌న్ నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించి వారికి స్ట్రెయిన్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌యాణికుల‌ను గుర్తించి.. వారికి ప‌రీక్ష‌లు జ‌రిపేలా రాష్ట్రాల‌ను ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో వేల మందిని గుర్తించిన పలు రాష్ట్రాలు వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాయి. అయితే.. మ‌రికొన్ని వేల మంది ఉన్నార‌ని.. అయితే.. వారి జాడ క‌నిపించ‌డం లేద‌ని పేర్కొంటుండ‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుతానికి విమాన యాన సంస్ధల నుంచి సేకరించిన డేటా ఆధారంగా మాత్రమే వీరిని గుర్తిస్తున్నారు. బ్రిటన్‌ నుంచి భారత్ వచ్చిన వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం త‌ల‌కు మించిన ప‌నిగా మారింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ప్ర‌యాణికులు త‌ప్పుడు వివ‌రాలు స‌మ‌ర్పించ‌డమే! ప్రయాణికులు ఇచ్చిన అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లలో చాలా వ‌ర‌కు తప్పుడువే అని తేలింది. మరికొందరు విమానాశ్రయాల్లో ప్రాధమిక పరీక్షలు నిర్వహించే లోపే తప్పించుకుని స్వస్ధలాలకు చేరుకున్నారు. ఇంకొందరు యూకే నంబర్లను కాంటాక్ట్‌గా ఇచ్చారు. వాటికి వాట్సాప్‌ కాల్స్‌ చేస్తున్నావారు లిఫ్ట్‌ చేయడం లేదని తేలింది. దీంతో వీరి గుర్తింపు కూడా కష్టంగా మారింది.

భారత్‌లో ఇచ్చిన అడ్రస్‌లు కూడా తప్పుగా తేలడంతో అధికారులు తలపట్టుకుంటున్నారు. ఇలా బ్రిటన్ నుంచి వచ్చిన వారు తప్పుడు అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లు, ఇతర వివరాలు లేక మిస్సయిన ఘటనలు పలు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. వీటిలో కర్ణాటక, తెలంగాణ, పంజాబ్‌, ఒడిశాతో పాటు పలు రాష్ట్రాలున్నాయి. వీటిలో పంజాబ్‌ టాప్‌లో ఉంది. బ్రిటన్ నుంచి పంజాబ్‌కు వచ్చిన వారిలో అత్యధికంగా 3,500 మంది ఇలా మిస్సయినట్లు అధికారులు తేల్చారు. కర్నాటకలో 2406 మంది బ్రిటన్‌ నుంచి రాగా వీరిలో 570 మంది అడ్ర‌స్ దొరకడం లేదు. తెలంగాణకు వచ్చిన 1100 మందిలో 279 మంది ఇలా మిస్సయ్యారు. ఒడిశాకు వచ్చిన 181 మందిలో 30 మంది కనిపించడం లేదు. ఉత్తరాఖండ్‌కు వచ్చిన 227 మందిలో 20 మంది మాయమయ్యారు. దీంతో దేవుడా.. ఈ స్ట్రెయిన్‌ను ఆపేదెలా? అని అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటే.. ప్ర‌జాస్వామ్య వాదులు మాత్రం ``వీరికి ఆ మాత్రం బాధ్య‌త లేదా?`` అని బ్రిట‌న్ నుంచి వ‌చ్చిన వారిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఎందుకంటే.. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో(తెలంగాణ, ఏపీ స‌హా) స్ట్రెయిన్ జాడ‌లు క‌నిపిస్తుండ‌డ‌మే!! మ‌రి ఇప్ప‌టికైనా స‌ద‌రు ప్ర‌యాణికులు స్వ‌చ్ఛందంగా వ‌చ్చి ప‌రీక్ష‌లు చేయించుకుంటే.. ఈ దేశానికి ఎంతో మేలు చేసిన వార‌వుతార‌ని అంటున్నారు.