Begin typing your search above and press return to search.

గుడిలోకి ఆమెను వెళ్లనీయలేదు

By:  Tupaki Desk   |   3 April 2016 3:51 AM GMT
గుడిలోకి ఆమెను వెళ్లనీయలేదు
X
ఎవరి నమ్మకాలు వారి. ఎవరి మత విశ్వాసాలు వారివి. అదేం చిత్రమో.. మైనార్టీ మతస్థులకు సంబంధించిన అంశాల్లో కోర్టులు తీర్పులు ప్రకటించే విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటమేకాదు.. వీలైతే.. ఈ విషయం మీద చర్చ జరగాలనే వ్యాఖ్యలు చేస్తారే కానీ.. తొందరపడి తీర్పు ఇవ్వరు. అదే సమయంలో హిందూ దేవాలయాలకు సంబంధించిన అంశాల్లో కోర్టులు తీర్పులు ఇచ్చేస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా శని సింగనాపూర్ లోని శనీశ్వరాలయాలంలో మహిళలకు నో ఎంట్రీ అంశం మీద బాంబే హైకోర్టు తీర్పు ఇవ్వటం తెలిసిందే.

ఆలయాల్లోకి ప్రవేశించే విషయంలో పురుషులతో సమానంగా మహిళలకు హక్కు ఉంటుందని.. వారిని ఎవరూ అడ్డుకోకూడదంటూ తీర్పు చెప్పటం తెలిసిందే. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో.. శనీశ్వరాలయంలోకి ప్రవేశించాలన్న పట్టుదలతో ఉన్న భూమాత బ్రిగేడ్ మహిళ సంఘం నాయకురాలు తృప్తి దేశాయ్ నేతృత్వంలోని కొందరు మహిళలు శనివారం ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నంచేశారు.

ఆమె ప్రయత్నాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమెను ఆలయంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు ప్రయత్నించారు. దీంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల ఆగ్రహం నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు.. తృప్తి దేశాయ్ ను ఆలయంలోకి అనుమతించలేదు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా తనను గుడిలోకి అనుమతించకుండా ఉండటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న సెంటిమెంట్ల విషయంలో తీర్పులు చెప్పేటప్పుడు అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకోవటం.. ఆయా మతస్తుల మతవిశ్వాసాల్ని పరిశీలించటం అవసరమన్న మాట తాజా పరిణామం చెప్పకనే చెబుతుందని చెప్పొచ్చు. మరి.. తాజా ఉద్రిక్తత ఏ రూపు దిద్దుకుంటుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.