Begin typing your search above and press return to search.

ఫ్లాయిడ్ ఎఫెక్ట్.. అమెరికాలో చోక్ హోల్డ్ కు చెక్ చెబుతూ ట్రంప్ నిర్ణయం

By:  Tupaki Desk   |   13 Jun 2020 5:45 AM GMT
ఫ్లాయిడ్ ఎఫెక్ట్.. అమెరికాలో చోక్ హోల్డ్ కు చెక్ చెబుతూ ట్రంప్ నిర్ణయం
X
యావత్ అమెరికాను మాత్రమే కాదు.. ప్రపంచాన్ని కదిలించిన అఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం వేళ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెల్ల పోలీసు కర్కశత్వానికి బలైన తీరు అందరిని కదిలించివేసింది. చిన్ననేరం చేశారో లేదో కూడా తెలీని వేళ.. అనుమానితుడి విషయంలో అమానుషంగా వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటమే కాదు.. అమెరికా మొత్తం రగిలిపోయింది.

ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ట్రంప్ సర్కారు.. వాటికి చెక్ పెట్టేందుకు వీలుగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. త్వరలో జరిగే అధ్యక్ష ఎన్నికల మీద ఫ్లాయిడ్ ఎఫెక్ట్ పక్కాగా పడే అవకాశం ఉన్నందున.. తనపై పెరుగుతున్న ఆగ్రహాన్ని తగ్గించుకునేందుకు ట్రంప్ తాజాగా ఒక నిర్ణయాన్ని వెల్లడించారు. నేరాలు చేశారన్న అనుమానంతో అనుమానితుల్ని.. నిందితుల్ని నియంత్రించే క్రమంలో పోలీసులు వ్యవహరించే కఠిన వైఖరికి చెక్ పెట్టేలా ట్రంప్ తాజా నిర్ణయం ఉంది.

పలు సందర్భాల్లో పోలీసులు అనుసరించే చోక్ హోల్డ్ (కిందకు పడేసి.. వారికి ఊపిరి ఆడకుండా అదుపులోకి తీసుకోవటం) ప్రక్రియను ఎంతో అవసరమైతే తప్పించి వాడొద్దని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఈ విధానాన్ని అమలు చేయాలన్నారు. వాస్తవానికి చోక్ హోల్డ్ మీద అమెరికాలోని పలురాష్ట్రాల్లో ఫ్లాయిడ్ ఉదంతం చోటు చేసుకున్న తర్వాత.. బ్యాన్ విధించారు. తాజాగా ట్రంప్ సైతం అదే బాటలో నడుస్తూ నిర్ణయాన్ని తీసుకోవటం గమనార్హం. అయితే.. ఈ విధానాన్ని చట్టబద్ధం చేస్తూ.. శాశ్వితంగా నిషేధిస్తే మరింత బాగుంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. ఆ పని ట్రంప్ చేస్తారో లేదో చూడాలి.