Begin typing your search above and press return to search.

ప్రపంచానికి షాకింగ్ న్యూస్ చెప్పిన ట్రంప్

By:  Tupaki Desk   |   30 May 2020 5:00 AM GMT
ప్రపంచానికి షాకింగ్ న్యూస్ చెప్పిన ట్రంప్
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రపంచం ఎలా పోయినా ఫర్లేదు.. అమెరికా ప్రయోజనాలు మాత్రమే తనకు ముఖ్యమన్నట్లుగా వ్యవహరించే ధోరణి.. చాలా ఎక్కువ. ప్రపంచానికే పెద్దన్నలా వ్యవహరించాల్సిన నేత.. అందుకు భిన్నంగా ఆయన వ్యాఖ్యలు.. నిర్ణయాలు ఉంటాయి. ప్రపంచానికి వణికిస్తున్న మాయదారి రోగానికి సంబంధించి డబ్ల్యూహెచ్ వో వ్యవహరించిన తీరుపై మొదట్నించి గుర్రుగా ఉన్న ఆయన.. తాజాగా ప్రపంచానికే షాకిచ్చేలా వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించారు. చైనాలో మొదలైన మాయదారి జబ్బు గురించి ప్రపంచానికి సరైన హెచ్చరికలు చేయలేదని మండిపడ్డ ఆయన.. సరైన సమయంలో సరైన పని తీరు కనపర్చని కారణంగా ఆ సంస్థ నుంచి అమెరికా వైదొలగాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మాట ప్రపంచానికి ఇప్పుడు షాకింగ్ గా మారింది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నెలకొల్పిన ఐక్యరాజ్యసమితిలో భాగమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా వైదొలగటం ఏలాంటి పరిణామాలకు కారణమవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అగ్రరాజ్యమే వైదొలిగితే.. ఎలా ఉంటుందన్నది ఇప్పుడు అంచనాకు అందని పరిస్థితి. మాయదారిరోగం మొదలైన నాటి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరుపై ట్రంప్ ప్రభుత్వం గుర్రుగా ఉంది.

చైనాకు తొత్తుగా మారిందన్న సంచలన ప్రకటనతో పాటు.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా ఇవ్వాల్సిన నిధుల్ని నిలిపివేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ట్రంప్ ఆరోపణల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఖండించింది. అదే సమయంలో వీరిద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నాలు సాగినా.. అవేమీ ఫలించలేదని చెబుతారు. ఇలాంటివేళలో.. ట్రంప్ నోట వచ్చిన సంచలన వ్యాఖ్య.. ప్రపంచానికి షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు.