Begin typing your search above and press return to search.

బైడెన్ కొడుకును టార్గెట్ చేసిన ట్రంప్.. దానికి ఎలా రియాక్టు అయ్యారంటే?

By:  Tupaki Desk   |   1 Oct 2020 10:30 AM IST
బైడెన్ కొడుకును టార్గెట్ చేసిన ట్రంప్.. దానికి ఎలా రియాక్టు అయ్యారంటే?
X
హుందాకు ప్రతీకగా చెప్పే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి అందుకు భిన్నంగా సాగుతున్నాయి. వ్యక్తిగత ధూషణలు.. తిట్లతో ముందుకు వెళుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండు పార్టీల నుంచి అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఇద్దరు ఒకే చోట సంవాదానికి దిటం.. ఆ సందర్భంగా దేశం ఎదుర్కొనే పలు సమస్యల మీద తమ పరిష్కారం ఏమిటో చెప్పటమే కాదు.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేస్తామన్న మాటను చెబుతుంటారు.

అందుకే.. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు ఏం మాట్లాడతారన్న విషయాన్ని అమెరికన్లు మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది. తాజాగా ట్రంప్.. బైడెన్ మధ్య జరిగిన సంవాదం.. రోటీన్ కు భిన్నంగా సాగిందని చెప్పాలి. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకోవటమే కాదు.. వారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత అంశాల్ని చర్చకు తెచ్చేశారు.

తెంపరితనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ట్రంప్.. తాజా సంవాదంలో తన రాజకీయ ప్రత్యర్థి బైడెన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన కుమారుడ్ని టార్గెట్ చేసిన కీలక విమర్శలు.. ఆరోపణలు చేశారు.జో బైడెన్కుమారుడు హంటర్ ను పూర్తిస్థాయి లక్ష్యంగా చేసుకున్నారు ట్రంప్. హంటర్ చైనాలో వ్యాపారం చేశాడని..కోట్లు సంపాదించాడని పేర్కొన్నారు.

అంతేకాదు.. ఉక్రెయిన్ లోని అనేక కంపెనీల్లో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారని.. అతని వ్యాపారాల కోసం బైడెన్ గతంలో ఉపాధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకొని లాబీయింగ్ కు పాల్పడినట్లుగా తీవ్ర ఆరోపణలు చేశారు. అతని ప్రవర్తన సరిగా లేని కారణంతోనే హంటర్ ను సైన్యం నుంచి వెలివేసిన వైనాన్ని గుర్తు చేశారు. డ్రగ్స్ కు హంటర్ బైడెన్ బానిస అంటూ సంచలన నిజాన్ని ప్రస్తావించారు.

తన కొడుకు విషయంలో ట్రంప్ చేస్తున్న ఘాటు విమర్శలు.. ఆరోపణల విషయంలో బైడెన్ తీవ్రంగానే స్పందించారు. తనపై చేస్తున్న వ్యక్తిగత దాడిని తప్పించుకునే ప్రయత్నం చేయకపోగా.. ట్రంప్ చెప్పిన మాటల్లో ఉన్న నిజాన్ని చెప్పేసే ప్రయత్నం చేశారు. చాలామంది అమెరికన్ల మాదిరే తన కొడుకుకూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడని.. ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు చెప్పారు.

ఎందుకిలా వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటావన్న ప్రశ్నతో పాటు.. తన కొడుకును చూసి తానిప్పుడు గర్వపడుతున్నట్లు బైడెన్ వెల్లడించారు. గతంలో చేసిన తప్పుల నుంచి పూర్తిగా బయటకు వచ్చేశారని చెప్పిన బైడెన్.. ట్రంప్ కుటుంబ సభ్యుల్లోనే ఆయనకు మద్దతు లేదన్న విషయాన్ని ప్రస్తావించారు. మీ కుటుంబంలోనే మీకు మద్దతు లేదని ట్రంప్ ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టే ప్రయత్నం చేశారు. అధ్యక్షులుగా ఎన్నికైతే అమెరికాకు ఏం చేస్తారన్న విషయం కంటే కూడా వారి వ్యక్తగత విషయాలే సెంట్రల్ పాయింగ్ గా మారటంపై పలువురు అమెరికన్లు పెదవి విరుస్తున్నారు.