Begin typing your search above and press return to search.

ఎన్నికల ప్రక్రియపై కోర్టులో కేసు వేసిన ట్రంప్

By:  Tupaki Desk   |   5 Nov 2020 1:00 PM IST
ఎన్నికల ప్రక్రియపై కోర్టులో కేసు వేసిన ట్రంప్
X
పేరుకే అగ్రరాజ్యం కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అచ్చంగా మనదేశంలో జరిగినట్లే జరుగుతోంది. కౌంటింగ్ నిలిపేయాలంటూ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టులో కేసు వేశారు. ఒక రాష్ట్రంలో కౌంటింగ్ నిలిపేయాలని మరో రాష్ట్రంలో రీ కౌంటింగ్ జరపాలని ట్రంప్ కేసు వేయటం ఆశ్చర్యంగా ఉంది. దాంతో అధ్యక్ష ఎన్నికల్లో ఎవరిది విజయమో తేలాలంటే ఇంకా సమయం పట్టేట్లుంది. ఈలోగా చాల విచిత్రాలే జరుగుతున్నాయి.

అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలంటే 538 ఎలక్టోరల్ ఓట్లలో 270 ఓట్లు రావాలి. అలాంటిది తాజా సమాచారం ప్రకారం డెమక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ కు 248 ఓట్లు వచ్చాయి. ఇక రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ కు 214 ఓట్లు పోలయ్యాయి. అంటే మరో 22 ఓట్లు వస్తే చాలు బైడెన్ అద్యక్షునిగా నియమితులైపోయినట్లే లెక్క. ఈ దశలోనే మిషిగాన్ రాష్ట్రంలో కౌంటింగ్ నిలిపేయాలంటు ట్రంప్ కోర్టులో కేసు వేశారు. అలాగే విస్కాన్సిన్ రాష్ట్రంలో ఓట్లను రీ కౌంటింగ్ జరపాలంటూ మరో కేసు వేశారు.

ఓట్ల పోలింగ్ లో మిషిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువున్నాయి. ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పై రెండు కూడా కీలకమైనవే. అందుకనే అభ్యర్ధులిద్దరు పై రాష్ట్రాలపై మొదటినుండి కన్నేసిన విషయం తెలిసిందే. అయితే పై రెండు రాష్ట్రాల్లోను బైడెన్ కే ఆధిక్యత వచ్చింది. దాంతో ట్రంప్ తట్టుకోలేకపోయారు. దాంతో వెంటనే మిషిగాన్ రాష్ట్రంలో పోలైన ఓట్ల లెక్కింపును నిలిపేయాలంటూ గోల మొదలుపెట్టారు. కారణం ఏమిటంటే పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వచ్చిన ఓట్లను కూడా పరిగణలోకి తీసుకున్నారంటూ వాదనకు దిగారు.

అలాగే విస్కాన్సిన్ రాష్ట్రం ఓట్ల కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయి కాబట్టి రీ కౌంటింగ్ జరపాలంటూ పట్టుబట్టడమే ఆశ్చర్యంగా ఉంది. ఓడిపోతామనే ఆందోళన ఉన్న నేతలు రీ కౌంటింగ్ అని, తప్పుడు ఓట్లు పోలయ్యాయనే గోల మనదేశంలో చూస్తుంటాము. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు పోలయ్యిందే 62 శాతం ఓట్లు. 120 సంవత్సరాల తర్వాత ఇంత ఎక్కువ స్ధాయిలో ఓటింగ్ జరగటం ఇదే మొదటిసారట. అంటే 62 శాతం ఓటింగ్ కే అమెరికాలో ఓట్ల లెక్కింపులో, ఫలితాల ప్రకటనలో ఇంత గందరగోళం జరిగితే ఇక మనదేశంలో లాగ ఏ 80 శాతమో, 90 శాతమో పోలింగ్ జరిగితే ఇంతే సంగతులు.

నిజానికి అమెరికాలో ఎన్నికల ప్రక్రియ మొదటి నుండి విచిత్రంగానే ఉంటుంది. ఎలక్టోరల్ ఓట్లని, పాపులిస్టిక్ ఓట్లని రెండు రకాలుగా ఉంటుంది. అలాగే అసలు పోలింగ్ తేదీకన్నా ముందే పాపులిస్టిక్ ఓట్ల వేయటానికి మామూలు జనాలను అనుమతించేస్తారు. దానికి తోడు పోలింగ్ బూత్ లకు నేరుగా వచ్చి ఓట్లేయటం, పోస్టల్ బ్యాలెట్లు లాంటివి మామూలే. ఇక ఎలక్టోరల్ ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా నిర్ణీత సమయం వరకు పోస్టల్ ఓట్లను అనుమతిస్తారు. ఈ పద్దతి మీద ఇపుడు ట్రంప్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

అన్నింటికన్నా విచిత్రమేమిటంటే కౌంటింగ్ మధ్యలో ఉండగానే తాను గెలిచేసినట్లు ట్రంప్ ప్రకటించేసుకున్నారు. తీరా ఫలితాలు చివరిదశకు వచ్చేసరికి రెండు రాష్ట్రాల్లో ఓటింగ్ పై కోర్టుకెక్కారు. చివరకు ఎన్నికల ప్రక్రియ మీద ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తుంటే ట్రంప్ విజయంపై అందరిలోను అనుమానాలు మొదలైపోయాయి. ఇంకా ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్ జరగాల్సుంది. కాబట్టి ఎవరు గెలిచారనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం.