Begin typing your search above and press return to search.

అలా జరిగితేనే తాను వైట్ హౌస్ ఖాళీ చేస్తానన్న ట్రంప్

By:  Tupaki Desk   |   27 Nov 2020 3:20 PM IST
అలా జరిగితేనే తాను వైట్ హౌస్ ఖాళీ చేస్తానన్న ట్రంప్
X
ఓడిపోయి.. గెలిచానని చెప్పే సిత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మాత్రమే సాధ్యం. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని.. అవకతవకలు చోటు చేసుకున్నాయని.. తానే గెలిచినట్లుగా చెప్పుకునే ట్రంప్ తీరుతో అమెరికా మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలన్ని విస్తుపోతున్నాయి. అధికార బదిలీకి మోకాలు అడ్డుతున్న ఆయన తీరు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్.. అధికార పగ్గాలు అందుకునేందుకు వీలుగా పావులు కదుపుతున్నారు. దీంతో.. ఏమవుతుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

వైట్ హౌస్ ఖాళీ చేసి బైడెన్ కు అప్పగించే విషయంలో ససేమిరా అంటూ న్యాయపోరాటానికి దిగిన ట్రంప్.. తాజాగా ఒక ట్వీట్ చేశారు. అందులో.. తాను వైట్ హౌస్ ఖాళీ చేయాలంటే ఏమేం జరగాలో చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాలపై తనకు ఇంకా నమ్మకం ఉందని.. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందన్న ఆయన.. 2020 యూఎస్ ఎన్నికలు చాలా క్టిష్టమైనవని అభివర్ణించారు.

మీడియాలోని ఒక వర్గం తనపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని.. పెద్ద ఎత్తున అసత్యాల్ని ప్రచారం చేస్తుందన్నారు. చివరకు ట్విట్టర్ మీదా ఆయన విమర్శలు చేశారు. ట్విట్టర సైతం తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ట్రెండింగ్ లో లేని వాటిని కూడా ట్రెండింగ్ లో ఉన్నట్లు చూపుతుందన్నారు. అసలు ట్రెండ్ అయ్యే అంశాల్ని పట్టించుకోవటం లేదన్నారు. బైడెన్ తదుపరి అధ్యక్షుడని ఎలక్టోరల్ కాలేజీ ధ్రువీకరిస్తే తాను వైట్ హౌస్ ఖాళీ చేస్తానని ట్వీట్ చేశారు. ఇప్పటిదాకా వైట్ హౌస్ ఖాళీ చేయటంపై మాట్లాడని ట్రంప్.. తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.