Begin typing your search above and press return to search.

మ‌నోళ్ల‌కు ట్రంప్ తీపిక‌బురు.. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి

By:  Tupaki Desk   |   7 Feb 2019 10:57 AM GMT
మ‌నోళ్ల‌కు ట్రంప్ తీపిక‌బురు.. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి
X
పే టు స్టే కుంభ‌కోణంలో భాగంగా, అమెరికాలో మ‌న విద్యార్థులు పోలీసుల ద‌ర్యాప్తును ఎదుర్కుంటున్న సంగ‌తి తెలిసిందే. క‌స్ట‌డీ పాలైన విద్యార్థులు వారం దాటినా విముక్తి కాక‌పోవ‌డంతో... త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న నెల‌కొంది. అమెరికాలో మ‌న వాళ్ల భ‌విష్య‌త్ ఎలా ఉంటుందో అనే ఆందోళ‌న కూడా స‌హ‌జంగానే వ్యక్త‌మ‌వుతోంది. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికా స‌హా ఇత‌ర దేశ‌స్తుల‌కు కీల‌క క్లారిటీ ఇచ్చారు. విదేశీయులు తమ దేశానికి రావాలని తాను కూడా కోరుకుంటున్నానని అయితే వారు చట్టపరంగా రావాలని సూచించారు. ప్రతిభ ఆధారిత వలస విధానం అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పారు.

కాంగ్రెస్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ తమ దేశ పౌరుల ఉద్యోగాలు, భవిష్యత్‌ కు రక్షణ కల్పించేలా వలస విధానం రూపొందించడం తమ నైతిక బాధ్యత అని చెప్పారు. చట్టపరంగా వచ్చే వలసదారులు దేశానికి అనేక విధాలుగా ఉపయోగపడుతున్నారని తెలిపారు. అయితే అక్రమ వలసదారులు దేశానికి పెనుముప్పుగా పరిణమించారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వలసలను నిరోధించేందుకు మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టితీరుతానని పునరుద్ఘాటించారు. గోడ నిర్మాణానికి మద్దతుగా గతంలో ఈ సభలో అనేకమంది ఓటేశారు. అయితే ఇప్పటివరకు నిర్మించలేకపోయారు. నేను గోడ కట్టితీరుతాను అని ట్రంప్ స్పష్టం చేశారు. బహిరంగ సరిహద్దులకు మద్దతిస్తున్న ధనిక రాజకీయవేత్తలు గోడలు, గేట్లు, గార్డుల రక్షణలో నివసిస్తున్నారని, అయితే సాధారణ శ్రామికులు మాత్రం అక్రమ వలసదారుల వల్ల మూల్యం చెల్లిస్తున్నారని చెప్పారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రిపబ్లికన్లు, డెమోక్రాట్లు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోసారి ప్రభుత్వ షట్‌ డౌన్‌ కు దారితీయకుండా ఈ విషయంలో ప్రతీకార రాజకీయాలను విడనాడాలని ఉభయ సభలను కోరారు.

అక్రమ వలసలు అత్యవసరంగా పరిష్కరించాల్సిన జాతీయ సంక్షోభమని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఎన్నటికీ సోషలిస్టు దేశం కాదంటూ ప్రకటించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై విజయం సాధించామని, మధ్యప్రాచ్యం నుంచి తమ దేశ బలగాలను ఉపసంహరించుకునేందుకు సమయం ఆసన్నమైందని చెప్పారు. అమెరికా ఉద్యోగాలు, సంపదను చైనా దొంగిలించకుండా ఆపేందుకే ఆ దేశంతో వాణిజ్యపరంగా దూకుడుగా వెళ్తున్నట్లు వివరించారు. దీంతోపాటుగా, తన అధ్యక్ష ఎన్నికపై హాస్యాస్పద, పక్షపాత విచారణకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై స్పెషల్ కౌన్సెల్ రాబర్ట్ ముల్లర్ విచారణను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.