Begin typing your search above and press return to search.

అమెరికాకు ట్రంప్ చెల్లించిన పన్ను 750 డాలర్లేనట?

By:  Tupaki Desk   |   28 Sept 2020 4:40 PM IST
అమెరికాకు ట్రంప్ చెల్లించిన పన్ను 750 డాలర్లేనట?
X
అమెరికా ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ అక్కడి ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ బాంబు పేల్చింది. అమెరికా కంటే భారత్ కే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లించాడని సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇదిప్పుడు అమెరికాలో వైరల్ గా మారింది.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన 2016 సంవత్సరంలో.. ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి ఏడాదిలో కేవలం 750 డాలర్లు (సుమారు 55000) మాత్రమే అమెరికాకు ఆదాయపు పన్నును చెల్లించారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆధారాలతో సహా తెలిపింది.

గత రెండు దశాబ్ధాలుగా ట్రంప్ - ఆయన కంపెనీలు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలను సేకరించి న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. గత 15 ఏళ్లలో పదేళ్లు ట్రంప్ పన్ను చెల్లించలేదని.. తన కంపెనీల్లో వచ్చిన నష్టాలను చూపిస్తూ పన్నులు ఎగ్గొట్టారని ఆ పత్రిక ఆరోపించింది.

ఇదే సమయంలో విదేశాల్లో ట్రంప్ పన్నులు చెల్లిస్తున్నట్టు పత్రిక పేర్కొంది. 2017లో ట్రంప్, ఆయన కంపెనీలు కలిపి భారత ప్రభుత్వానికి 1,45,400 డాలర్లు పన్ను రూపంలో చెల్లించినట్లు పేర్కొంది.

కాగా ఈ వార్తలపై స్పందించిన ట్రంప్ ఇవన్నీ తప్పుడు వార్తలు అంటూ కొట్టిపారేశారు. తాను పన్నులన్నీ చెల్లిస్తూ వస్తున్నానని తెలిపారు. గాలి వార్తలు నమ్మవద్దంటూ ప్రజలను కోరారు.

అయితే అమెరికాకు రిచర్డ్ నిక్సన్ అధ్యక్షుడయ్యాక అందరూ ప్రతి ఏడాది ఆదాయపు పన్ను వివరాలు తెలిపారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక మాత్రం ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. దీంతో పత్రిక సంచలన కథనాన్ని బయటపెట్టింది. రెండోసారి అధ్యక్షుడు అవుదామనుకుంటున్న ట్రంప్ కు ఇదిప్పుడు ఇబ్బందిగా మారింది.