Begin typing your search above and press return to search.

పెద్దన్నకు షాక్.. ఇరాన్ పై ట్రంప్ కు ఓటమి తప్పలేదుగా?

By:  Tupaki Desk   |   16 Aug 2020 2:40 PM IST
పెద్దన్నకు షాక్.. ఇరాన్ పై ట్రంప్ కు ఓటమి తప్పలేదుగా?
X
ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికాకు భారీ షాక్ తగిలింది. తాను ఏమనుకుంటే అది జరిగిపోవాలన్న పట్టుదల.. తాను కత్తి కట్టిన దేశంపై ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేసే టాలెంట్ అగ్రరాజ్యానికి ఎంత ఎక్కువో తెలియంది కాదు. అలాంటి అమెరికాకు.. తాజాగా ఐక్యరాజ్యసమితిలో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ తో ఉన్న పంచాయితీ నేపథ్యంలో.. ఆ దేశంపై ఐక్యరాజ్య సమితి విధించిన ఆయుధ ఆంక్షల్ని నిరవధికంగా కొనసాగించాలని కోరుతూ అమెరికా ప్రవేశ పెట్టిన తాజా తీర్మానం భద్రతా మండలిలో వీగిపోవటం గమనార్హం.

అమెరికాను నడిపించే విషయంలో ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ వ్యవహరించే తీరుతో పాటు.. తాము టార్గెట్ చేసిన దేశానికి దన్నుగా నిలిచేందుకు ఎక్కువ దేశాలు నిరాకరించేలా ఇంతవరకు తన పట్టును ప్రదర్శించిన అమెరికా.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. భద్రతా మండలి తీర్మానానికి అనుకూలంగా ఒక్క దేశం నుంచి మాత్రమే మద్దతు లభించటం గమనార్హం.

సాధారణంగా తీర్మానాన్ని ఆమోదించటానికి భద్రతా మండలిలోని పదిహేను సభ్య దేశాల్లో కనీసం తొమ్మిది దేశాలు మద్దతు పలకాల్సి ఉంది. ఈ క్రమంలో అమెరికాకు డొమినికన్ రిపబ్లిక్ తప్ప మరే దేశం దన్నుగా నిలవకపోవటం విశేషం. అమెరికా తీర్మానానికి అనుకూలంగా రెండు.. వ్యతిరేకంగా రెండు ఓట్లు రాగా.. మిగిలిన పదకొండు దేశాలు ఓటింగ్ లో పాల్గొనకుండా దూరంగా ఉన్నాయి.

బలమైన దేశాలైన చైనా.. రష్యాలు కూడబలుక్కున్నట్లుగా అమెరికా తీర్మానాన్ని వ్యతిరేకించాయి. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తీర్మానం వీగినట్లుగా ప్రకటించారు. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ఈ పరిణామం కీలకంగా మారటమే కాదు.. అమెరికాకు ఎదురుదెబ్బగా పలువురు అభివర్ణిస్తున్నారు. కీలకమైన అధ్యక్ష ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఈ పరిణామం ట్రంప్ సర్కారుకు డ్యామేజ్ చేస్తుందన్న మాట వినిపిస్తోంది.