Begin typing your search above and press return to search.

‘కీప్‌ అమెరికా గ్రేట్‌’ ట్రంప్‌ కొత్త నినాదం

By:  Tupaki Desk   |   11 March 2018 10:38 PM IST
‘కీప్‌ అమెరికా గ్రేట్‌’ ట్రంప్‌ కొత్త నినాదం
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మాంచి ఊపుమీద ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. గ‌త అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగేన్‌’ అనే నినాదాన్ని పలికిన ట్రంప్‌ తాజాగా కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. ‘కీప్‌ అమెరికా గ్రేట్‌’ అనే నినాదాన్ని ఉచ్ఛరించారు. 2020లో మళ్లీ జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. త్వరలో జరుగనున్న పెన్సిల్వేనియా ఉప ఎన్నికలో భాగంగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు.

ఇప్పటికే తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి చాలా రోజులవుతున్నదని, ఎన్నో విజయాలను సాధించామని ట్రంప్ చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో 2020 ఎన్నికల్లో మళ్లీ తాను పాత నినాదం మేక్‌ అమెరికా గ్రేట్‌ అగేన్‌ ను పలుకనని తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, మన ఉద్యోగాలు తిరిగి వస్తున్నాయని పేర్కొన్నారు. గత ఏడాదికాలంలో 30 లక్షల ఉద్యోగాలను సృష్టించామని చెప్పారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ఓప్రా విన్‌ ఫ్రే పోటీ చేస్తే ఆమెపై తాను పోటీ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ట్రంప్‌ తెలిపారు.