Begin typing your search above and press return to search.

కేరళ కోసం ట్రూ జెట్ ఉచిత సర్వీసులు

By:  Tupaki Desk   |   19 Aug 2018 11:28 AM GMT
కేరళ కోసం ట్రూ జెట్ ఉచిత సర్వీసులు
X
వరద తాకిడి వల్ల ఏర్పడిన విపత్తులో అల్లడిపోతున్న కేరళ వాసులకు తమ వంతుగా సాయం అందించేందుకు ట్రూ జెట్ విమానయాన సంస్థ ముందుకు వచ్చింది. మూడు రోజుల పాటు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి త్రివేండ్రం దాకా ఉదయం ఐదున్నరకు నిత్యం ఆరు టన్నుల సహాయ సామగ్రితో పాటు 65 ప్రయాణికులను చేరవేసే వెసులుబాటుతో ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రత్యేక సర్వీసును మంగళ-బుధ-గురువారాల్లో నడపనుంది. చెన్నయ్ నుంచి ఇదే విధంగా మరో విమానం కూడా త్రివేండ్రంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఎవరు కేరళ నుంచి రావాలి అనే దాని గురించి అక్కడి ప్రభుత్వ సహకారంతో లిస్ట్ తీసుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దాటాల్సిన వాళ్లకు ప్రాధాన్యం ఇచ్చేలా అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటారు.

ఇప్పటికే పలు స్వచ్చంద సేవా సంస్థలు టన్నుల్లో ఆహారం - నిత్యావసర వస్తువులు భాగ్యనగర వాసుల నుంచి సేకరించాయి. వాటిని ప్యాక్ చేసి సిద్ధంగా ఉంచి రవాణా కోసం ఎదురుచూస్తున్నాయి. ట్రూ జెట్ విమానాల ద్వారా అవి బాధితులకు చేరబోతున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి విశోక్ మాన్ సింగ్ వివరాలు తెలిపారు. విపత్కాల సమయంలో కేరళకు అండగా దేశమంతా నిలుస్తోందని తమ వంతు బాధ్యతగా ఉచిత సర్వీసులు అందిస్తున్నామని తెలిపారు. సామగ్రి చేరవేతతో పాటు కేరళ నుంచి హైదరాబాద్ చెన్నయ్ రావాల్సిన ప్రయాణికుల జాబితా సిద్ధం చేయటం కోసం తెలంగాణ-తమిళనాడు-కేరళ ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. మూడు రోజుల పాటు ఈ సేవలు ఎటువంటి ఆటంకాలు లేకుండా అందించేందుకు ట్రూ జెట్ సంస్థ అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ రకంగా వస్తువులను చేరవేయటంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ప్రయాణీకులను ఇక్కడికి తీసుకువచ్చే విధంగా చొరవ తీసుకుంటున్న ట్రూ జెట్ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.