Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ - ఐప్యాక్ డీల్ ఓకే.. 2రోజు కేసీఆర్ కు పీకే ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   25 April 2022 4:42 AM GMT
టీఆర్ఎస్ - ఐప్యాక్ డీల్ ఓకే.. 2రోజు కేసీఆర్ కు పీకే ఏం చెప్పారు?
X
రంగం ఏదైనా తనకు తెలియని సమాచారం ఇస్తారన్న అభిప్రాయం కలిగితే.. ప్రగతి భవన్ కు కానీ ఫాం హౌస్ కానీ పిలిపించుకోవటం.. వారితో గంటల కొద్దీ మాట్లాడటం లాంటివి టీఆర్ఎస్ బిగ్ బాస్ కేసీఆర్ కున్న ప్రత్యేకతలుగా చెప్పాలి. రెండు తెలుగురాష్ట్రాల్లో మరే పార్టీ అధినేత కానీ మరే ఉద్యమ నేతలో కానీ ఈ తరహా అలవాటు కనిపించదు. తాజాగా ఐప్యాక్ అధినేత.. రాజకీయ వ్యూహకర్త.. త్వరలో కాంగ్రెస్ లో కీలక స్థానాన్ని సొంతం చేసుకోవాలని తపిస్తున్న పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ ను తన ప్రగతిభవన్ లో రెండు రోజులు అట్టి పెట్టుకొని మరీ.. గంటల కొద్దీ చర్చించిన వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చగా మారింది.

మొదటి రోజున దాదాపు పన్నెండు-పద్నాలుగు గంటల పాటు సాగిన చర్చల అనంతరం.. రెండో రోజు కూడా చర్చల్ని కంటిన్యూ చేయాలని డిసైడ్ కావటం.. ఆయన్ను హైదరాబాద్ మహానగరంలోని మరే స్టార్ హోటల్ కు పంపే కన్నా.. తన రాజసౌధంలోనే ఉంచేసుకున్న దిల్ దారు కేసీఆరేనని చెప్పాలి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన సుదీర్ఘ చర్చలు ఒక కొలిక్కి రావటమే కాదు..ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ను ఇరువురు సిద్ధం చేసిన వైనం బయటకు వచ్చింది.

తాను కాంగ్రెస్ పార్టీలో చేరినా.. తన సంస్థ ఐప్యాక్ మాత్రం తెలంగాణలో టీఆర్ఎస్ కోసం పని చేస్తుందన్న మాట ఇచ్చేశారు ప్రశాంత్ కిశోర్. ఈ విషయాన్ని మరెవరో కాకుండా ముఖ్యమంత్రి కేసీఆరే వెల్లడించారు కాబట్టి.. దీన్ని అధికారిక ప్రకటనగా చెప్పుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైనది కాంగ్రెస్ విషయంలో కేసీఆర్ ఏం చేస్తారు? పీకే ఏం కోరారు? అన్న దాని మీదా క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీ.. కాంగ్రెస్ లతో తమ పార్టీ సమదూరం పాటిస్తుందన్న విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీఏకమైతే ఆ పార్టీని గద్దె దింపగలమన్న విషయాన్ని కేసీఆర్ కు పీకే చెప్పినట్లుగా చెబుతున్నారు.

బీజేపీని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకే తాను ఆ పార్టీని ఎంచుకున్నట్లుగా కేసీఆర్ కు పీకే స్పష్టం చేశారు. అందుకే తమ సంస్థ అయిన ఐప్యాక్ టీఆర్ఎస్ కు రాజకీయ సలహా సేవల్ని కొనసాగిస్తాయని చెప్పటమే కాదు.. దీనికి సంబంధించిన డీల్ కూడా ఓకే అయినట్లుగా చెబుతున్నారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్.. ఇతర పార్టీల బలాబలాలు.. ఎమ్మెల్యేలు.. ఇతర నేతలపై నిర్వహించిన సర్వే ఫలితాల్ని సీఎం కేసీఆర్ కు పీకే వివరించినట్లుగా చెబుతున్నారు.

తాముచేసిన సర్వే ప్రకారం రాష్ట్రంలోకొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. ఆ విషయం పార్టీ అధినాయకత్వానికి తెలిసిందన్న విషయంపై అవగాహన ఉన్న తర్వాత కూడా వారు మారటం లేదని.. మరోసారి సిట్టింగులకు సీట్లు వస్తాయన్న ధైర్యంతో ఉన్నట్లుగా కేసీఆర్ కు పీకే వివరించినట్లు చెబతున్నారు. జనంలో వ్యతిరేకత ఉన్న వారిని మార్చే విషయాన్ని పరిశీలించాలని పీకే సూచన చేయగా.. కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లుగా చెబుతున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని.. అంతిమంగా అది టీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందన్న విశ్లేషణను పీకే చేసినట్లుగా తెలుస్తోంది. బీజపీ కాంగ్రెస్ పోటీ వల్ల టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలుతుందని.. అది టీఆర్ఎస్ కు లాభంగా మారి.. అంతిమంగా విజయం సాధిస్తామన్న విశ్లేషణను చేసినట్లుగా చెబుతున్నారు. మరి.. పీకే వ్యూహాలు గెలుస్తాయా? తెలంగాణ ప్రజల చైతన్యం గెలుస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానానికి మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.