Begin typing your search above and press return to search.

ఉద్యోగాల భ‌ర్తీ ఊసేది?

By:  Tupaki Desk   |   1 Oct 2021 6:00 AM IST
ఉద్యోగాల భ‌ర్తీ ఊసేది?
X
ప్ర‌జ‌ల‌కు ఆశ చూపించి.. ఓట్లు రాబ‌ట్టుకోవ‌డానికి పార్టీలు ప్ర‌య‌త్నిస్తాయి. హామీల వ‌ర్షం కురిపించి అధికారంలోకి వ‌చ్చాక అన్నీ మ‌ర్చిపోతాయి. మ‌ళ్లీ ఎన్నిక‌లు అన‌గానే పార్టీకి ఆ హామీలు గుర్తుకువ‌స్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు? అంటే.. తెలంగాణ‌లో ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలోనూ అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తోంది. స‌రిగ్గా ఏదైనా ఎన్నిక‌ల‌కు ముందు ఉద్యోగాల భ‌ర్తీ విష‌యాన్ని తెర‌మీద‌కు తెస్తున్న ప్ర‌భుత్వం.. ఆ త‌ర్వాత దాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఇలా ప్ర‌జ‌ల‌ను కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక తేదీ రావ‌డంతో ఈ ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ ఉద్యోగాలను భ‌ర్తీ చేస్తామ‌నే అంశాన్ని టీఆర్ఎస్ వాడుకునేందుకు సిద్ధ‌మ‌వుతుంద‌నే వార్త‌లు వస్తున్నాయి.

దుబ్బాక ఉప ఎన్నిక మొద‌లు.. నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక వ‌ర‌కూ టీఆర్ఎస్ నిరుద్యోగ‌ల కోసం 50 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని అదిగో నోటిఫికేష‌న్ ఇదిగో నోటిఫికేష‌న్ అంటూ తాత్సారం చేస్తూ వ‌స్తోంది. కానీ దుబ్బాక ఉప ఎన్నిక‌తో పాటు జీహెచ్ఎంసీ ఉప ఎన్నిక‌లో ఆ పార్టీకి షాక్ త‌గిలింది. నాగర్జ‌న సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో విజ‌యం ద‌క్క‌డంతో ఇక ఉద్యోగాల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ ఇస్తున్నామ‌నే హ‌డావుడి చేసింది. ఏయే శాఖ‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో జాబితా సిద్ధం చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించ‌డం.. ఆయా శాఖ‌ల్లోని అధికారులు ఆఘ‌మేఘాల మీద 60 వేల‌కు పైగా ఖాళీలు ఉన్న‌ట్లు లెక్కతేల్చ‌డం జ‌రిగింది. దీంతో ఇక నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌ని నిరుద్యోగులు ఆశ‌ప‌డ్డారు. రాష్ట్రంలో కొత్త‌గా ఏర్ప‌డిన జిల్లాల‌కు రాష్ట్రప‌తి ఆమోద ముద్ర వేయ‌డంతో జోనళ్ల వారీగా కూడా నియ‌మాకాల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది.

కానీ నోటిఫికేష‌న్ కోసం ఎదురు చూసిన నిరుద్యోగుల‌కు మ‌ళ్లీ నిరాశ త‌ప్ప‌లేదు. ఏదో రెండు రోజులు హ‌డావుడి చేసిన ప్ర‌భుత్వం దాని గురించి మ‌ర్చిపోయింది. ఇటు వైఎస్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల నిరుద్యోగుల కోసం ప్ర‌తి మంగ‌ళ‌వారం దీక్ష‌లు చేస్తున్నా.. నిరుద్యోగుల ప‌క్షాన నిలిచేందుకు కాంగ్రెస్ నిరుద్యోగ జంగ్ సైర‌న్ మోగించ‌బోతున్నా ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేదు. ఇప్పుడేమో ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక కోడ్ అమ‌ల్లో ఉంది కాబ‌ట్టే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌డం లేదు అని చెప్పుకోవ‌డానికి టీఆర్ఎస్ నేత‌ల‌కు ఓ మంచి అవ‌కాశం దొరికింది. మ‌రి ఇన్ని రోజులు ప్ర‌భుత్వం ఏం చేసిందంటే మాత్రం వాళ్ల ద‌గ్గ‌ర స‌రైన స‌మాధానం ఉండ‌దు అని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇప్ప‌టికే ఎలాగైనా హుజూరాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ద‌ళిత బంధు ప‌థకాన్ని ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించిన కేసీఆర్‌.. ఇప్పుడు ఎన్నిక‌లు అయిపోగానే ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామ‌ని మ‌ళ్లీ ఆశ‌పెట్టి ఓట్లు ద‌క్కించుకోవాల‌నే ప్ర‌ణాళిక‌తో ఉన్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ ఇలా ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తిసారి ఉద్యోగ భర్తీ చేస్తామంటూ నిరుద్యోగుల‌ను మోసం చేస్తున్న కేసీఆర్ ప‌ప్పులు ఈ సారి ఉడ‌క‌వ‌ని రాజ‌కీయ నిపుణులు చెబుతున్నారు.