Begin typing your search above and press return to search.

మూడు సామాజిక వర్గాలు, మూడు రంగాల నుంచి ముగ్గురు.. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే

By:  Tupaki Desk   |   18 May 2022 12:59 PM GMT
మూడు సామాజిక వర్గాలు, మూడు రంగాల నుంచి ముగ్గురు.. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే
X
టీఆర్ఎస్ రాజ్య సభ అభ్యర్థులు ఖరారయ్యారు. త్వరలో జరుగనున్న ఎన్నికలకు ముగ్గురిని సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. వారి పేర్లను ఆయన వెల్లడించారు. ఎప్పటినుంచో అనుకున్నట్లుగానే టీఆర్ఎస్ పార్టీ పత్రిక నమస్తే తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్‌రావు, హెటిరో డ్రగ్స్‌ అధినేత డా.బండి పార్థసారథిరెడ్డి, గ్రానైట్ పరిశ్రమల అధినేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)ని రాజ్య సభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు.

పూర్తికాలం ఎవరికి? రెండేళ్లు ఎవరికి?
తెలంగాణలో ప్రస్తుతం మూడు రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా.. వీటిలో ఒకదాని పదవీకాలం రెండేళ్లే ఉంది. ఎమ్మెల్సీగా అవకాశం రావడంతో రాజ్యసభ ఎంపీగా రెండేళ్ల పదవీకాలం ఉండగానే బండ ప్రకాశ్‌ రాజీనామా చేశారు. ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. దీనికి రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో రాజ్యసభ అభ్యర్థులను సీఎం ఫైనల్‌ చేశారు. దామోదర్‌రావు, పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలో ఒకరు రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇక ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న డి.శ్రీనివాస్‌ (డీఎస్‌), కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు పదవీకాలం వచ్చేనెలలో ముగియనుంది. ఆ స్థానాల్లోనూ ఎన్నికల నిర్వహణకు సైతం ఈసీ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసింది. వీటికి మాత్రం ఈనెల 24 నుంచి 31 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఆయా స్థానాలకు మరో ఇద్దరు అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. బండ ప్రకాశ్‌ స్థానంలో రేపు ఒకరు నామినేషన్‌ దాఖలు చేయనుండగా.. డీఎస్‌, లక్ష్మీకాంతరావు స్థానంలో మిగిలిన ఇద్దరు ఈనెల 31లోపు నామినేషన్లు వేయన్నారు. అయితే, ఇక్కడ బండ ప్రకాశ్ స్థానంలో.. రెండేళ్ల పదవీ అవకాశం ఎవరికి అవకాశం ఇచ్చారు అనేది చూడాలి.

రెడ్డి, మున్నూరు కాపు, వెలమ
ప్రస్తుతం అభ్యర్థులుగా ప్రకటించిన వారిలో పార్థసారథి రెడ్డి.. రెడ్డి సామాజిక వర్గం వారు. దామోదర్ రావు వెలమ. వద్దిరాజు రవిచంద్ర మున్నూరు కాపు. ఇద్దరు ఓసీలు, ఓ బీసీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణలో ఈ మూడు ప్రధాన సామాజిక వర్గాలు కావడం గమనార్హం. రెడ్లు ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉండగా.. మున్నూరు కాపులు జనాభా పరంగా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వెలమలకూ రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం ఉంది.

ఖమ్మంకు ప్రాధాన్యం
వద్దిరాజు రవిచంద్ర వరంగల్ జిల్లాకు చెందినవారు. అయినా ఖమ్మం జిల్లాలో ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన రాజకీయ కార్యక్షేత్రంగా ఖమ్మంనే ఎంచుకునేలా ఉన్నారు. గాయత్రి గ్రానైట్స్ ఖమ్మం జిల్లాలోనే ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. పార్థసారథి రెడ్డిది కూడా ఖమ్మం జిల్లానే. యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రిడియంట్స్ తయారీలో హెటెరో పేరుగాంచింది. ఈ కంపెనీలో 21 వేల మంది పనిచేస్తున్నారు. కొవిడ్ కాలంలో రెమ్ డెసివర్ ఇంజక్షన్ పేరు మార్మోగిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ నుంచి లైసెన్స్ తీసుకుని ఈ ఔషధాన్నికొవిఫర్ పేరిట హెటెరో విక్రయించింది. దామోదర్ రావుది కరీంనగర్ జిల్లా వాసి. రాజ్యసభ సీటు కోసమే.. గతంలో రెండోసారి టీడీటీ డైరెక్టర్ పదవి ఇస్తామన్నా ఆయన తిరస్కరించారు.