Begin typing your search above and press return to search.

స్థానిక ఎమ్మెల్సీ ఫ‌లితాలు దేనికి సంకేతం?

By:  Tupaki Desk   |   30 Dec 2015 11:15 AM GMT
స్థానిక ఎమ్మెల్సీ ఫ‌లితాలు దేనికి సంకేతం?
X
వ‌రుస విజ‌యాల‌తో మాంచి ఊపు మీదున్న గులాబీ అధినేత‌కు తాజా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాలు కాస్తంత చిరాకు తెప్పించ‌టం ఖాయం. అయుత చండీయాగంతో తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికి మంచి జ‌ర‌గాల‌న్న ఆశ‌యంతో పాటు.. త‌మ విజ‌య ప‌రంప‌ర‌కు ఎదురులేకుండా ఉండాల‌న్న త‌లంపుతో చేప‌ట్టిన యాగం పూర్తి అయిన రోజు త‌ర్వాత (మొత్తంగా అయుత చండీయాగం పూర్తి కావ‌టం) వచ్చిన ఎన్నిక‌ల ఫ‌లితాలు కాస్తంత మింగుడు ప‌డ‌నవిగా చెప్ప‌క త‌ప్పుదు.

వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌లో రికార్డు మెజార్టీతో దూసుకెళ్లిన కారుకు ఇప్పుడీ అనుకోని స్పీడ్ బ్రేక‌ర్లు ఏమిట‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌. మొత్తం ప‌ది జిల్లాలున్న తెలంగాణ‌లో తొమ్మిది జిల్లాల్లో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కొన్నిచోట్ల కాంగ్రెస్‌.. తెలుగుదేశం పార్టీల‌కు అభ్య‌ర్థులు కూడా దొర‌క‌ని దుస్థితి. కొంత‌మంది అభ్య‌ర్థులుగా ఎంపిక చేసిన వారు సైతం.. అభ‌య హ‌స్తాన్ని వ‌దిలేసి మ‌ధ్య‌లో కారు ఎక్కేసిన వైనం కాంగ్రెస్ పార్టీకి క‌రెంటు షాకులా త‌గిలింది.

మొత్తం 12 స్థానాల్లో నామినేష‌న్ల ప‌ర్వంలోనే ఆరు స్థానాలు అధికార‌ప‌క్షం ఖాతాలో ప‌డిపోయిన నేప‌థ్యంలో.. ఎన్నిక‌లు జ‌రిగే ఆరుస్థానాల్లో తుది ఫ‌లితం మీద ఎవ‌రికి పెద్ద ఆశ‌ల్లేవు. నిజం చెప్పాలంటే.. న‌ల్గొండ ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసేంత‌వ‌ర‌కూ న‌ల్గొండ ఎమ్మెల్సీలో ఆయ‌న సోద‌రుడి విజ‌యం మీద పెద్ద అంచ‌నాల్లేవు. త‌న సోద‌రుడు కానీ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైతే.. తన ఎమ్మెల్యే ప‌దవికి రాజీనామా చేస్తాన‌ని చెప్ప‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది.

కాంగ్రెస్ నేత‌లు సైతం తొంద‌ర‌ప‌డొద్ద‌ని.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్య‌లు త‌గ‌ద‌ని కోమ‌టిరెడ్డితో అన్న‌ట్లు చెబుతారు. అయితే.. త‌న సోద‌రుడి గెలుపు మీదున్న ధీమాతోనే ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు చెబుతారు. త‌న మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే చేత‌ల్లోనూ రాజీ ప‌డ‌ని త‌త్వం కోమ‌టిరెడ్డిని హీరోలా చేసింది. ఇక‌.. మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో డీకే అరుణ న‌డిపిన మంత్రాంగంగా చెప్పాలి. గెలుపు మీదున్న ధీమా.. అధినేత వ్యూహం మీదున్న ఆత్మ‌విశ్వాసం టీఆర్ ఎస్ నేత‌లు త‌ప్పులు చేసే అవ‌కాశాన్ని ఇచ్చాయ‌న్న మాట వినిపిస్తోంది.

ఈ మ‌ధ్య కాలంలో గెలుపు రుచికి అల‌వాటు ప‌డిన గులాబీద‌ళానికి తాజా ఓట‌మి చిన్న‌పాటి షాక్ లాంటిది. మితిమీరిన ఆత్మ‌విశ్వాసం ఏమాత్రం మంచిది కాద‌ని.. గెలుపు ధీమాతో ఉంటే ఎంత‌గా దెబ్బ ప‌డుతుంద‌న్న‌ది తాజా ఓట‌మి ఒక పాఠంగా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు. తాజా ఓట‌మి.. తెలంగాణ అధికార‌ప‌క్షానికి ఒక హెచ్చ‌రిక లాంటిదనే చెప్ప‌క త‌ప్ప‌దు. త‌మ‌కు తిరుగులేద‌న్న ధీమా అస్స‌లు ఉండ‌కూడ‌ద‌ని.. తామెంత క‌ష్ట‌ప‌డినా కొరుకుడుప‌డ‌ని స్థానాలు ఉన్నాయ‌న్న విష‌యాన్ని గులాబీ నేత‌లు గుర్తిస్తే మంచిది. లేదంటే.. తాజాగా ఎదురైన ఎదురుదెబ్బ‌లు త‌ప్ప‌వు. అదే జ‌రిగితే.. విజ‌యాలకు కేరాప్ అడ్ర‌స్ గా నిలుస్తుంద‌ని.. క‌నుచూపు మేర దూరంలో త‌మ‌కు తిరుగులేద‌న్నది ఎంత‌మాత్రం నిజం కాద‌న్న భావ‌న పెరిగి పెద్ద‌దైపోవ‌టానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌దు.