Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారును ఎవరూ విమర్శించకూడదా?

By:  Tupaki Desk   |   7 Jun 2016 9:51 AM GMT
కేసీఆర్ సర్కారును ఎవరూ విమర్శించకూడదా?
X
ఒక ప్రభుత్వాన్ని.. ప్రభుత్వాధినేతను ఎవరూ విమర్శలు చేయకూడదా? తమకు తప్పుగా అనిపించిన అంశాల్ని చర్చకు లేవనెత్తకూడదా? ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే అది పెద్ద తప్పు అవుతుందా? రాష్ట్ర సర్కారును విమర్శిస్తే.. ఆ రాష్ట్ర ప్రజలందరిని అవమానించినట్లు అవుతుందా? ఇలాంటి ప్రశ్నలు ఒక్కసారి మీద పడిపోయిన భావన కలిగేలా చేస్తున్నారు తెలంగాణ అధికారపక్ష నేతలు. తెలంగాణ రాష్ట్ర సర్కారు మీద తెలంగాణ రాజకీయ జేఏసీ నేత కోదండరాంపై తెలంగాణ అధికారపక్ష నేతలు చెలరేగిపోయిన తీరు పలువురిని విస్మయానికి గురి చేసింది.

ప్రజాస్వామ్య దేశంలో విమర్శలు కామన్. నిర్మాణాత్మకంగా విమర్శలు ఎవరైనా చేస్తే.. వారు లేవనెత్తిన అంశాలకు సమాధానాలు చెప్పటం ద్వారా.. వారి వాదనను వీగిపోయేలా చేయొచ్చు. కానీ.. ప్రశ్న వేయటమే తప్పుగా.. విమర్శ చేయటమే మహాపరాధంగా వ్యవహరించటంతోనే అసలు సమస్య అంతా. గడిచిన రెండేళ్ల వ్యవధిలో కేసీఆర్ సర్కారు మీద కోదండరాం పెద్దగా మాట్లాడలేదని చెప్పాలి. తాజాగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఇష్యూ బేస్డ్ గా కొన్ని విమర్శలు చేసి.. తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై పెదవి విరిచారు.

విపక్షాలు సైతం విమర్శలు చేయకుండా ఉన్న సమయంలో కోదండరాం విమర్శలు చేయటం తెలంగాణ అధికారపక్ష నేతలకు అస్సలు నచ్చలేదన్నట్లుగా ఉంది. ఎవరూ తమను వేలెత్తి చూపేందుకు సాహసించని సమయంలో తమ సర్కారుపై కోదండరాం విమర్శలు చేయటాన్ని తెలంగాణ ముఖ్యనేతలంతా తట్టుకోలేనట్లుగా రియాక్ట్ కావటం కనిపిస్తోంది. ఏకాఏకిన పన్నెండు మంది టీఆర్ ఎస్ మంత్రులు.. ఎంపీలు.. ఇతర నేతలు కోదండరాంపై విరుచుకుపడిన తీరు చూసిన వారు.. మాష్టారిపై అంతలా రియాక్ట్ కావాల్సి ఉందా? అన్న సందేహం వ్యక్తమయ్యే పరిస్థితి.

అన్నింటికి మించి.. తెలంగాణ సర్కారును ఏమైనా అంటే నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజల్ని అవమానించినట్లేనంటూ టీఆర్ ఎస్ నేతలు వ్యాఖ్యానించటం చూస్తే.. ఆ సూత్రం అన్ని ప్రభుత్వాలకు అప్లై కావాలిగా? అదే జరిగితే.. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వంపై చేసిన విమర్శలన్నీ తెలంగాణ ప్రజల్ని అవమానించినట్లేనా? అదే అయితే.. తెలంగాణ సాధన ఎందుకు సాధ్యమవుతుంది? అధికారపక్షం పాలన చేయటం.. అది చేసే తప్పుల్ని విపక్షాలు.. మేధావులు విమర్శించటం మామూలే. కానీ.. అలాంటివేమీ ఉండకూడదన్నట్లుగా మాట్లాడటంలోనే అసలు సమస్య అంతా. ఈటెల లాంటి నేతలైతే.. పార్టీ పెట్టి కోదంరాం విమర్శలు చేయాలంటూ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శలు చేయటానికి అందులో అర్థం ఉంటే సరిపోతుంది తప్పించి.. మరిక ఎలాంటి పదవులు ఉండనక్కర్లేదన్న విషయం టీఆర్ ఎస్ నేతలు ఎందుకు మర్చిపోతున్నారు? అంటే.. కేసీఆర్ సర్కారును ఎవరూ విమర్శించకూడదా..?