Begin typing your search above and press return to search.

టెన్ష‌న్ ప‌డుతున్న టీ మంత్రులు

By:  Tupaki Desk   |   16 Dec 2015 9:28 AM GMT
టెన్ష‌న్ ప‌డుతున్న టీ మంత్రులు
X
తెలంగాణ‌లోని మంత్రులు వ‌రుస అగ్నిప‌రీక్ష‌లు ఎదుర్కొంటున్నారు. వరంగ‌ల్ ఉప ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వర్గ ఇన్‌ చార్జిలుగా ప్ర‌చారాలు నిర్వ‌హించారు. విమ‌ర్శ‌లూ - నిర‌స‌న‌లు ఎదుర్కొన్నారు. ఇక ఆ ఎన్నిక ముగిసింద‌నుకుంటే.. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వ‌చ్చిప‌డ్డాయి. ఇప్పుడు త‌మత‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ ప‌ట్టును నిలుపుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ ను పక్కాగా కొనసాగిస్తున్నా... గెలుపు కోసం కుస్తీపట్లు పడుతున్నారట. ఆరు స్థానాల్లో ఏకగ్రీవంగా గెలవడంతో ఆ జిల్లాల మంత్రులకు టెన్ష‌న్ పోయింది. ఇప్పుడు మిగిలిన జిల్లాల్లో మంత్ర‌లు తెగ టెన్ష‌న్ ప‌డిపోతున్న‌రు. మహబూబ్‌ నగర్‌ - రంగారెడ్డి జిల్లాల్లో రెండేసి స్థానాలుండ‌గా.. ఖమ్మం - నల్గొండ జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఉంది. ఈ ఆరు స్థానాల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత తమపైనే ఉండటంతో ఆయా జిల్లాల్లో మంత్రులు చాలా ఆందోళ‌న చెందుతున్నారు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మహేందర్‌ రెడ్డికి డబుల్‌ పరీక్ష. ఎందుకంటే ఒక స్థానంలో స్వయానా సోదరుడు న‌రేంద‌ర్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. మరో స్థానంలో కేటీఆర్‌ సన్నిహితుడైన శంభీపూర్‌ రాజు బరిలో ఉన్నారు. ఈ ఇద్దర్నీ గెలిపించుకునేందుకు రెట్టింపు కష్టం చేయక తప్పదన్న చర్చ జరుగుతోంది. ఈ జిల్లాలో కాంగ్రెస్‌ - టీడీపీ రెండూ బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌ను తెరాస‌లో చేర్చుకునే ప్రయత్నాలు ఫలించి ఉంటే ఇక్కడ కూడా మిగతా ఆరు స్థానాల్లాగే ఎన్నిక ఏకగ్రీవం అయ్యేదన్న చర్చ జరుగుతోంది.

మ‌హేంద‌ర్‌ రెడ్డికి ఇప్పుడు కొత్త త‌ల‌నొప్పి ఎదుర‌వుతోంది. అటు సోద‌రుడితో పాటు కేటీఆర్ స‌న్నిహితుడైన రాజును కూడా గెలిపించుకోవాల్సి రావ‌డంతో ఆయ‌న క‌ఠిన ప‌రీక్ష ఎదుర్కొంటున్నారు.

న‌ల్గొండ జిల్లాలో ఆస‌క్తిక‌ర పోరు నడుస్తోంది. నల్గొండ జిల్లాలో పట్టున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉండటంతో ఇక్కడ ఢీ అంటే ఢీ తప్పదంటున్నారు. జిల్లా మంత్రి జ‌గ‌దీశ్వర్ రెడ్డి కూడా అదే స్థాయిలో ఈ ఎన్నిక‌ల్ని స‌వాల్‌ గా తీసుకొని ముందుకెళ్తున్నారు. టీఆర్ ఎస్ త‌ర‌పున చిన్న‌పురెడ్డి పోటీ చేస్తున్నారు. మంత్రి జ‌గ‌దీశ్వర్ రెడ్డి ఓట‌ర్లను త‌మ పార్టీలో చేర్చుకుంటున్నా ప్ర‌త్యర్థి బలంగా ఉండటంతో పోలింగ్‌ వరకూ టెన్షన్‌ తప్పదంటున్నారు.

ఇక ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ ఎస్ ఆశ‌ల‌న్నీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుపైనే ఉన్నాయి. ఇక ప్ర‌తిప‌క్షాలు వ్యూహాత్మ‌కంగా సీపీఐ అభ్య‌ర్థి పువ్వాడ నాగేశ్వ‌ర‌రావుకు మ‌ద్ద‌తు ఇస్తున్నాయి. దీంతో అధికార పార్టీ అభ్య‌ర్థి బాల‌సాని ల‌క్ష్మీనారాయ‌ణ గెలుపు కోసం మంత్రి తుమ్మ‌ల చెమ‌టోడుస్తున్నారు. ఏదేమైనా ఏక‌గ్రీవాల సంగ‌తి ఎలా ఉన్నా మిగిలిన జిల్లాల్లో అధికార పార్టీగి ట‌ఫ్ ఫైట్ ఉండ‌డంతో ఆ జిల్లాల మంత్రులు టెన్ష‌న్‌..టెన్ష‌న్‌ గా ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్ చేస్తున్నారు. ఈ పోటీలో ఎంత‌మంది మంత్రులు పాస్ అవుతారో వేచి చూడాలి.