Begin typing your search above and press return to search.

పాలేరులో కారు దూసుకుపోనుందా?

By:  Tupaki Desk   |   17 May 2016 11:59 AM IST
పాలేరులో కారు దూసుకుపోనుందా?
X
పోటాపోటీగా సాగిన ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో కీలకఘట్టమైన పోలింగ్ పూర్తి అయ్యింది. మంట పుట్టించే వేసవిలోనూ 90శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవటం విశేషంగా చెప్పొచ్చు. పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం.. తెలంగాణ అధికారపక్షం పాలేరు ఉప ఎన్నికల్లో విజేతగా నిలవనుందన్న అంచనాలు జోరుగా వినిపిస్తున్నాయి. పాలేరు అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎంపిక చేయటం సానుకూలంగా మారిందని చెబుతున్నారు.

మాజీ మంత్రి.. దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికల్లో సానుభూతిని రగిలించాలని కాంగ్రెస్ సహా విపక్షాలు ఎంత ప్రయత్నించినా.. టీఆర్ ఎస్ నేతల సమిష్టి కృషి ముందు చిన్నబోయినట్లు చెబుతున్నారు. ఒకఅంచనా ప్రకారం.. పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయం ఖాయమని తేల్చి చెప్పటమే కాదు.. 45వేల వరకూ మెజార్టీ పక్కా అన్న లెక్కలు వినిపిస్తున్నాయి.

పాలేరు ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం.. ఈ ఎన్నికల బాధ్యతను తన కుమారుడు.. కమ్ మంత్రి కేటీఆర్ కు అప్పజెప్పటం తెలిసిందే. పాలేరులో కారు గెలుపు పక్కా కావాల్సిందేనన్న పట్టుదలతో ఉన్న టీఆర్ ఎస్ పార్టీ.. తన సర్వశక్తుల్ని ఒడ్డిందని చెప్పాలి. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న పాలేరు.. తాజా ఉప ఎన్నికతో కారు వశం కావటం ఖాయమంటున్నారు. మరి.. ఈ అంచనాల్లో నిజమేమిటన్నది మరో రెండు రోజుల్లో తేలిపోనుందని చెప్పాలి.