Begin typing your search above and press return to search.

జాకెట్ యాడ్ తో టీఆర్ఎస్ ఈ రోజు దూసుకెళ్లిందిగా?

By:  Tupaki Desk   |   30 Nov 2020 5:40 PM IST
జాకెట్ యాడ్ తో టీఆర్ఎస్ ఈ రోజు దూసుకెళ్లిందిగా?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో పోల్ మేనేజ్ మెంట్ లో కొత్త పాఠాలు నేర్పేలా వ్యవహరిస్తోంది టీఆర్ఎస్ పార్టీ. ప్రత్యర్థి పార్టీలకు అంతుచిక్కని వ్యూహాలతో.. విషయం మొత్తం అర్థమయ్యేసరికి పుణ్యకాలం గడిచిపోయేలా ఉన్న గులాబీ బాస్ వ్యూహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెర తీస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేసరికే.. ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న విషయాన్ని డివిజన్ల వారీగా బ్లూ ప్రింట్ సిద్ధం చేసిన వైనం నోటి వెంట మాట రాకుండా చేస్తోంది.

తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న వ్యూహం దీనికి నిదర్శనంగా చెప్పాలి. ఎన్నికల ప్రచార వేళలో ప్రత్యర్థుల మెరుపుదాడుల్ని కాచుకుంటూ.. వారి విమర్శలు.. ఆరోపణల్ని తిప్పి కొట్టింది. గాలి తనకు కాస్త ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. దాని ప్రభావం ఓటరు మీద పడకుండా ఉండేందుకు అవకాశం ఉన్న దేన్ని విడిచిపెట్టటం లేదు.

ఎన్నికల ప్రచారం ముగిసి.. కీలక పోలింగ్ కు కేవలం రోజు వ్యవధి మాత్రమే ఉన్న వేళలో.. ఆ పార్టీకి అన్ని మీడియా సంస్థలకు చెందిన దినపత్రికల్లో మొదటి పేజీని జాకెట్ యాడ్ తో గులాబీ రంగుతో అద్దేసింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో మరే పార్టీకి అవకాశం ఇవ్వని రీతిలో గ్రేటర్ పరిధిలోని మెట్రో స్తంభాలు మొదలు.. బిల్ బోర్డులు.. లాలీపాప్ లు.. హోర్డింగ్స్ మొత్తం అధికార పార్టీనే దర్శనమిస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పోలింగ్ రోజున వెలువడే అన్ని ప్రముఖ దినపత్రికల మొదటి పేజీని టీఆర్ఎస్ బుక్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఓటర్ల మనసుల్ని దోచుకునేలా ఉన్న ఈ ప్రకటనలతో ఓట్లు ఏ మేరకు రాలుతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. చివర్లో దూకుడు ప్రదర్శిస్తున్న గులాబీ దళానికి ధీటుగా స్పందించేందుకు ఇతర పార్టీలకు అవకాశం లేకుండా పోయిందన్న మాట వినిపిస్తోంది.