Begin typing your search above and press return to search.

గ్రేటర్ లో గులాబీ బాస్ వ్యూహం లెక్క తెలిస్తే.. నోట మాట రాదంతే

By:  Tupaki Desk   |   23 Nov 2020 10:30 AM IST
గ్రేటర్ లో గులాబీ బాస్ వ్యూహం లెక్క తెలిస్తే.. నోట మాట రాదంతే
X
దుబ్బాక ఉప ఎన్నికతో తగిలిన షాక్ ఒకవైపు.. ఆ గెలుపుతో చెలరేగిపోతున్నకమలనాథులకు దిమ్మ తిరిగేలా షాక్ ఇవ్వటంతో పాటు.. దుబ్బాకలో విజయం బలుపు కాదు వాపు మాత్రమే అన్న విషయాన్ని అర్థమయ్యేలా చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఇందుకు గ్రేటర్ ఎన్నికల్ని వినియోగించుకుంటున్నారు. మిగిలిన పార్టీలతో పోలిస్తే.. గ్రేటర్ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు.. ఆ ఎన్నికల్లో గతంలో మాదిరి ఫలితాన్ని రిపీట్ చేసేందుకు దాదాపుగా ఏడాదికి పైనే కసరత్తు చేస్తున్నారు. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. తమకున్న అధిక్యతను ప్రదర్శించటం ద్వారా తమ దరిదాపుల్లోకి ఎవరూ రాలేరన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలన్నదే గులాబీ బాస్ భావనగా చెబుతున్నారు.

ఇందుకోసం భారీ ఎత్తున వ్యూహాన్ని సిద్ధం చేసినట్లుగా చెప్పక తప్పదు. గ్రేటర్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ అనుసరించే వ్యూహానికి సంబంధించిన వివరాలు కొన్ని బయటకు వచ్చాయి. ఈ వ్యూహాన్ని చూస్తే.. గులాబీ బాస్ సిద్ధం చేసిన ఎన్నికల బ్లూ ప్రింట్ ఇదేనా? అన్న భావన కలుగక మానదు. గ్రేటర్ లోని 150 స్థానాల్లో బరిలోకి దిగిన టీఆర్ఎస్.. ఏ డివిజన్ కు ఆ డివిజన్ కు వేర్వేరు వ్యూహాల్ని సిద్ధం చేసుకోవటం గమనార్హం.

గ్రేటర్ మొత్తానికి ఒకటే వ్యూహంగా కాకుండా.. గతంలో తాము గెలుచుకున్న స్థానాలతో పాటు.. మరికొన్నింటి మీదా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇందుకోసం తనకున్న వనరులు మొత్తాన్ని వినియోగించుకోవటంతో పాటు.. పార్టీ శ్రేణుల్ని మొత్తంగా కదలించి.. హైదరాబాద్ లో పాగా వేసేలా చేశారని చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్ల బాధ్యతను పలువురు నేతలకు అప్పజెప్పారు. ఒక్కో డివిజన్ కు కనిష్ఠంగా ఒక ఇంఛార్జి.. గరిష్ఠంగా నలుగురు ఇంఛార్జిలను నియమించారు.

ఇందుకోసం మంత్రులు.. ఎంపీలతో పాటు.. ఎమ్మెల్సీలను రంగంలోకి దించారు. 62 ఎమ్మెల్యేలు ఇప్పుడు గ్రేటర్ లోని పలు డివిజన్ల బాద్యతల్ని అప్పజెప్పారు. చివరకు గ్రేటర్ ఎన్నికల బాధ్యతను తీసుకున్న మంత్రి కేటీఆర్ సైతం.. ఒక డివిజన్ కు బాధ్యత తీసుకోవటం గమనార్హం. గ్రేటర్ శివారులోని హైదర్ నగర్ డివిజన్ కు మంత్రి కేటీఆర్ ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కేటీఆర్ తనకు అత్యంత సన్నిహితుడైన తెలంగాణ కో ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ కె. రవీంద్రరావును నియమించారు. ఆయనతో పాటు నిజాంపేట కార్పొరేషన్ మేయర్ నీలా గోపాలరెడ్డికి బాద్యతలు ఇచ్చారు.

కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ డివిజన్ లో గులాబీ జెండా సగర్వంగా ఎగిరేందుకు వీలుగా.. 76 బూత్ లకు 15 మంది చొప్పున బాధ్యుల్ని నియమించారు. ఇందుకోసం సిరిసిల్ల నుంచి 800 మందిని దర్పించినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. సిరిసిల్ల నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 3500 మందిని రప్పించి హైదరాబాద్ లోని వివిధ డివిజన్లలో ప్రచారానికి దించటం గమనార్హం. అంతేకాదు.. ఇప్పటివరకు ఎక్కడా.. ఏ ఎన్నికల్లోనూ అనుసరించని వ్యూహాన్ని సీఎం కేసీఆర్ ఫాలో అవుతున్నట్లు చెబుతున్నారు.

ఎన్నికల్లో గెలుపు కోసం ఏ అభ్యర్థి అయితే మంచిదన్న అంశంపై సర్వేలు చేయించటం తెలుసు. కానీ.. సదరు డివిజన్ లో ఏ నేత అయితే బాగా ప్రభావం చూపుతారన్న సర్వే చేయించటం ఊహకు అందనిది. ఇప్పుడు అదే వ్యూహాన్ని ఫాలో అయిన కేసీఆర్.. గ్రేటర్ లోని విలక్షణను పరిగణలోకి తీసుకొని.. ఏ డివిజన్ లో ఏ కులానికి.. ఏ ప్రాంతానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు? వారిని ఎవరు ప్రభావితం చేయగలుగుతారన్న విషయంపై సర్వే నిర్వహించి మరీ ఎంపిక చేయటం చూస్తే.. కేసీఆరా మజాకానా? అన్న భావన కలుగక మానదు.