Begin typing your search above and press return to search.

లోక్‌ స‌భ‌లో బాబుకు గిట్ట‌ని చ‌ర్చ చేసిన టీఆర్ ఎస్‌

By:  Tupaki Desk   |   27 Dec 2017 8:47 AM GMT
లోక్‌ స‌భ‌లో బాబుకు గిట్ట‌ని చ‌ర్చ చేసిన టీఆర్ ఎస్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అస‌లేమాత్రం గిట్ట‌ని అంశంపై లోక్‌ సభలో టీఆర్‌ ఎస్ ఎంపీలు ర‌చ్చ చేశారు. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలోని అన్ని అంశాల‌పై గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టే ఏపీ సీఎం చంద్ర‌బాబు..హైకోర్టు విభజనపై అస‌లే మాత్రం స్పందించర‌ని...త‌న పార్టీ ఎంపీల‌తో గ‌ళం విప్పించ‌కుండా ఉంటార‌నే టాక్ ఉంది. కాగా హైకోర్టు విభ‌జ‌న‌పై టీఆర్ ఎస్ ఎంపీలు లోక్‌ స‌భ‌లో వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీఆర్‌ ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. `వి వాంట్ హైకోర్ట్‌` అంటూ ఎంపీలు నినదించారు.

రాష్ట్రం విడిపోయి మూడున్నరేళ్లు గడిచినా హైకోర్టు విభజనపై కేంద్రం జాప్యం చేస్తోందని ఎంపీలు మండిపడ్డారు. చట్టసభల వేదికగా ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదని దుయ్యబట్టారు. హైకోర్టును విభజన చేయాలంటూ సభలో ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. హైకోర్టు విభజనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఎంపీలు నిప్పులు చెరిగారు. హైకోర్టు విభజనను కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హైకోర్టు విభజనకు ఈ పార్లమెంట్ సమావేశాల్లో పోరాడతామని ఎంపీలు స్పష్టం చేశారు. హైకోర్టు విభజనపై హామీలు కాదు.. స్పష్టమైన ప్రకటన రావాలని టీఆర్‌ ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. ఉమ్మడి హైకోర్టు రెండు రాష్ర్టాలకు న్యాయం చేయలేకపోతుందన్నారు. హైకోర్టు తెలంగాణ సమస్యలను తెలంగాణ కోణంలో పరిశీలించాల్సిన అవసరముందన్నారు. ఉమ్మడి హైకోర్టు నియామకాల్లో స్పష్టత లేదని తెలిపారు.

హైకోర్టు విభజనపై కేంద్రం ఎందుకు ఆలస్యం చేస్తోందని టీఆర్‌ ఎస్ ఎంపీ జితేందర్‌ రెడ్డి ప్రశ్నించారు. వాయిదా తీర్మానం అనంత‌రం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం హైకోర్టును తక్షణమే విభజించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కొత్త రాష్ర్టాలు ఏర్పడినప్పుడు హైకోర్టు విభజనలో అప్పటి ప్రభుత్వాలు ఆలస్యం చేయలేదని ఎంపీ జితేందర్‌ రెడ్డి గుర్తు చేశారు. హైకోర్టును విభజించకపోవడం వల్ల తెలంగాణకు నష్టం కలుగుతుందన్నారు. ఉద్యోగాలు - ప్రమోషన్ల విషయంలో తెలంగాణ వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు కేసులు పెండింగ్‌ లో ఉన్నాయని చెప్పారు.

చట్టసభల వేదికగా గతంలో కేంద్రమంత్రులు రాజ్‌ నాథ్ సింగ్ - సదానంద గౌడ - వెంకయ్యనాయుడు హైకోర్టు విభజనపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికీ హామీలు అమలు కావడం లేదన్నారు. హైకోర్టు విభజనకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారని గుర్తు చేశారు. ఏపీ హైకోర్టుకు ల్యాండ్ - భవనం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇస్తామని ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పినప్పటికీ ఆలస్యం ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. హైకోర్టును విభజించకపోవడానికి గల రహస్యమేంటో చెప్పాలని ఎంపీ జితేందర్‌ రెడ్డి డిమాండ్ చేశారు.