Begin typing your search above and press return to search.

రైల్వే బడ్జెట్ టీఆరెస్ కు బాగా నచ్చిందట

By:  Tupaki Desk   |   26 Feb 2016 6:24 AM GMT
రైల్వే బడ్జెట్ టీఆరెస్ కు బాగా నచ్చిందట
X
తెలంగాణలో ఇతర నదులునన్నిటినీ మింగేస్తూ మహానదిలా మారుతున్న టీఆరెస్ పార్టీ ఇప్పుడు కేంద్రంలోని బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఆ పార్టీ స్వరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకాలం ఏ రోజూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడిన పాపాన పోని టీఆరెస్ ఇప్పుడు కేంద్రంపై ప్రశంసలు కురిపిస్తోంది. దేశమంతా పెదవి విరిచేసిన రైల్వే బడ్జెట్ ను బాగుదంటూ పొగడ్తలు కురిపిస్తోంది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంలో చేరేందుకు టీఆరెస్ చేస్తున్న ప్రయత్నాలేనని విమర్శలు అంటున్నారు.

సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ గత ప్రభుత్వాలకు భిన్నంగా సాగిన మాట వాస్తవమే. శుష్క హామీలు ఇవ్వకుండా తాయిలాలు ప్రకటించకుండా, అలా అని భారం వేయకుండా యాక్షన్ ప్లాన్ చెప్పుకొచ్చారు ప్రభు. మరోవైపు గత బడ్జెట్ లో చెప్పినవాటిలో ఏవి ఎంతవరకు అమలయ్యాయన్నది చెప్పుకొచ్చారు. దాంతో రైల్వే బడ్జెట్ ముగిసింది. ఈ రైల్వే బడ్జెట్ పై రాజకీయ వర్గాలు - సాధారణ ప్రజలు - నిపుణులు - మేధావులు అంతా పెదవివిరిచారు. శశి థరూర్ వంటి నేతలైతే అసలు బడ్జెట్ ప్రవేశపెట్టినట్లే తాము భావించడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి సందర్భంలో టీఆరెస్ ఎంపీలు మాత్రం శభాష్ శభాష్ అంటూ బడ్జెట్ ను పొగిడారు.

రైల్వే బడ్జెట్‌ ప్రతిపాదనలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయంటూ టీఆరెస్ ఎంపీలు కవిత - జితేందర్‌ రెడ్డి ప్రశంసించారు. దీంతో రైల్వే బడ్జెట్ తో ప్రారంభించి కేంద్రానికి చేరువయ్యే ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు యాదాద్రికి రైల్వే లైను పొడిగింపు.. బోధన్-బీదర్ లైను వంటి కీలక ప్రాజెక్టులు రావడంతో ధన్యవాదాలు తెలిపే ఉద్దేశంతోనే ఇలా ప్రశంసలు కురిపించారన్న వాదనా వినిపిస్తోంది.