Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ పార్టీకి ఇందిరాగాంధీయే స్ఫూర్తి అట‌

By:  Tupaki Desk   |   23 July 2018 5:57 AM GMT
టీఆర్ ఎస్ పార్టీకి ఇందిరాగాంధీయే స్ఫూర్తి అట‌
X
ఔను. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐర‌న్ లేడీ - మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరాగాంధీయే తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ పార్టీకి స్ఫూర్తి అంట‌. ఆశ్చ‌ర్య‌పోకండి...ఇటీవ‌లి కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒంటికాలిపై లేస్తున్న టీఆర్ ఎస్ పార్టీ అదే నోటితో....ఆ పార్టీకి చెందిన ఉక్కుమ‌హిళను స్ఫూర్తిగా తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ విష‌యం వెల్ల‌డించింది ఎవ‌రో కాదు...టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ కు బంధువైన కరీంనగర్ లోక్‌ సభ సభ్యుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన అవిశ్వాసం విష‌యంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అవిశ్వాసం విష‌యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమ‌ర్శ‌లు స‌రికావ‌ని వినోద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పార్లమెంట్‌ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఎండగట్టామని అన్నారు.

తెలంగాణకు కాంగ్రెస్ - బీజేపీలు రెండూ అన్యాయం చేశాయని - నరేంద్రమోదీ ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకోవాలని ఎంపీ వినోద్‌ కుమార్ సూచించారు. తెలంగాణకు కేటాయింపులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గురించి కాంగ్రెస్ నాయకులకు ఏం తెలుసునని ప్రశ్నించారు. తెలంగాణకు మరోసారి అన్యా యం చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నదని - ఆంధ్రప్రదేశ్‌ కు పన్ను రాయితీలు కల్పించి ఇక్కడి పరిశ్రమలు తరలిపోవడానికి ఆ పార్టీ నేతలు కుట్రచేస్తున్నారని వినోద్ మండిపడ్డారు. అవిశ్వాసంలో టీఆర్‌ ఎస్ తీసుకున్న నిర్ణయం వంద శాతం సరైనదేనని ఎంపీ వినోద్‌ కుమార్ స్పష్టం చేశారు. టీఆర్‌ ఎస్‌ ది ఇందిరాగాంధీ నిర్వహించిన అలీనోద్యమ తరహా విధానమని చెప్పారు. తెలంగాణ ప్రజలపై ఈగ - దోమ కూడా వాలనివ్వబోమని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రాదని ఆ పార్టీ నేతలు అంచనాకు వచ్చినట్టుగా ఉన్నారని, అందుకే ఏపీపై ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్ లోక్‌ సభ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పన్ను రాయితీలు ఇస్తామని చెప్పారని - తెలంగాణ ప్రస్తావన తీసు కురాలేదని గుర్తుచేశారు. దీంతో తెలంగాణలోని పరిశ్రమలు తరలిపోవాలని చూస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ దేశ - విదేశాలు తిరిగి రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని - వాటి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ఏపీకి పన్ను రాయితీలతో తెలంగాణ నోట్లో మట్టికొట్టాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఇదే విషయాన్ని రాహుల్‌ తో చెప్పించాలని, ప్రజలే కాంగ్రెస్ సంగతి చూసుకుంటారని వినోద్ హెచ్చరించారు.