Begin typing your search above and press return to search.

‘సెప్టెంబరు 17’పై కవిత మార్క్ వాదన విన్నారా?

By:  Tupaki Desk   |   8 Sep 2016 6:49 AM GMT
‘సెప్టెంబరు 17’పై కవిత మార్క్ వాదన విన్నారా?
X
నచ్చిన దాని గురించి ఎంత గొప్పగా చెబుతారో.. నచ్చని దాని గురించి అంతే చెడు చేసి చెప్పటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీకి అలవాటే. తమకు తగ్గట్లుగా మాట్లాడే మాటలు ఎలా ఉంటాయనటానికి తాజాగా ఎంపీ కవిత చెప్పిన మాటలు చూస్తే అర్థమైపోతాయి. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవంపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా 1948లో భారత సర్కారు చేసిన ఆపరేషన్ తో నిజాం స్టేట్ కు స్వాతంత్ర్యం లభించిందన్న విషయం తెలిసిందే. నిజాం నియంత పాలన నుంచి బయటపడిన ప్రజలు.. ఆనందోత్సాహాల మధ్య సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఆ చారిత్రక దినోత్సవాన్ని తర్వాతి కాలంలో అధికారంలో ఉన్నఉమ్మడి రాష్ట్ర పాలకులు విస్మరించారు. మైనార్టీ ఓటు బ్యాంకు కోసం ఇలాంటివి చేశారన్న ఆరోపణ వినిపిస్తుంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబరు 17ను తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవంగా నిర్వహించాలని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తాము ఆ పని చేస్తామంటూ ఉద్యమనేతగా కేసీఆర్ పలుమార్లు స్పష్టం చేయటాన్ని మర్చిపోలేం. కానీ.. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబరు17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించటానికి కేసీఆర్ సముఖత వ్యక్తం చేయలేదు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే.. మైనార్టీల మనోభావాలు దెబ్బ తింటాయన్నది ఒక వాదన. ఇందులో నిజానిజాల మాట ఎలా ఉన్నా.. సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించే విషయంలో స్పష్టంగా ఉన్న కేసీఆర్ సర్కారు.. విపక్షాలు ఎంతగా డిమాండ్ చేస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తోంది. అదే సమయంలో ఈ అంశంపై పలువురు టీఆర్ఎస్ నేతలు మాట్లాడేందుకు సైతం ఇష్టపడటం లేదు. ఇదిలా ఉంటే.. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎంపీ కవిత మాత్రం భిన్నంగా సెప్టెంబరు17 అంశంపై తరచూ మాట్లాడుతున్నారు.

మొన్నామధ్య మాట్లాడిన కవిత సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచనదినోత్సవంగా చేయటం ద్వారా.. హిందూ.. ముస్లింల మధ్య దూరంపెరుగుతుందంటూ చేసిన వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలపై మొదలైన విమర్శలు ఒక కొలిక్కి రాక ముందే తాజాగా మరికొన్ని వ్యాఖ్యలుచేశారు కవిత. సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అడుగుతున్నారని.. తొలిదశలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన 350 మంది విద్యార్థులు బలిదానాలు మరిచిపోవాలా? మలిదశలో శ్రీకాంతాచారి ప్రాణత్యాగం.. కేసీఆర్ పోరాటం.. వందల మంది తెలంగాణ వాదుల ప్రాణత్యాగాలు మర్చిపోవాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించకపోవటం ద్వారా నిజాం దాష్టీకాలకు.. అవనమానాలకు బలైన వారి మాటేమిటి? తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక లాంటి తెలంగాణ సాయుధ పోరాటానికి గుర్తింపు మాటేమిటి? నిజాం నవాబుకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం 1948లో చేసిన ఆపరేషన్ గురించి ఇప్పుడు అధికారికంగా గుర్తు చేసుకోవాలని చెప్పటం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్న కవిత.. ఒకవేళ అలాంటిదే జరగని పక్షంలో ఈ రోజున తెలంగాణ ప్రజాస్వామ్యంలో ఉండేది కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. నిజాంకు వ్యతిరేకంగా సైనిక చర్య కారణంగానే కోట్లాది మంది స్వేచ్ఛా వాయువులు పీల్చారన్న విషయాన్ని కవిత ఎలా మర్చిపోగలరు? ఒకవేళ ఈ రోజు ఆమెకు వచ్చిన సందేహం.. ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ కు ఎందుకు రాలేదు? ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని మాటిచ్చిన కేసీఆర్ మాటకు కవిత సూటిగా సమాధానం చెప్పాకే విమోచన దినోత్సవం గురించి మాట్లాడటం బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలంటూ చెబుతున్న మాటలోనూ ‘సీమాంధ్రుల కుట్ర’ కోణంలో చూడటం కవితకు మాత్రమే సాధ్యమవుతుందేమో..?