Begin typing your search above and press return to search.

ఉద‌యం 6 గంట‌ల‌కే మొద‌లు పెడుతున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   6 Sep 2018 5:06 AM GMT
ఉద‌యం 6 గంట‌ల‌కే మొద‌లు పెడుతున్నార‌ట‌!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తుకు సంబంధించి కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకునే రోజు ఇవాళే (గురువారం).దీనికి సంబంధించి పార్టీల‌కు అతీతంగా ఎమ్మెల్యేలంతా ఉద్విగ్నంగా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌రో ఆర్నెల్ల ప‌ద‌వీ కాలం ఉన్న‌ప్ప‌టికీ.. ముంద‌స్తుకు వెళ్లాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న నేప‌థ్యంలో ఈ రోజు మ‌ధ్యాహ్నం అసెంబ్లీని ర‌ద్దు చేయాల‌ని సీఎం కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్ ను కోర‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ సాగుతున్న ప్ర‌చారానికి త‌గ్గ‌ట్లే అసెంబ్లీ ర‌ద్దు నిర్ణ‌యాన్ని కేసీఆర్ ప్ర‌క‌టిస్తే.. ఈ రోజే ఎమ్మెల్యేల‌కు ఆఖ‌రి రోజు అవుతుంది. కేసీఆర్ సిఫార్సుపై గ‌వ‌ర్న‌ర్ ఆమోద‌ముద్ర వేసిన మ‌రుక్ష‌ణం ఎమ్మెల్యేలు కాస్తా.. మాజీలు అయిపోతారు. అంటే.. ఎమ్మెల్యేలుగా ఈ రోజే ఆఖ‌రు రోజు అన్న మాట‌.

ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త లేన‌ప్ప‌టికీ బుధ‌వారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప‌లువురు ఎమ్మెల్యే ఉరుకులు ప‌రుగులు తీస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఏ పార్టీ అన్న‌ది త‌ర్వాత‌.. ముందైతే ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని ఎమ్మెల్యేగా దోచుకునే చిట్ట‌చివ‌రి అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో.. దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఎమ్మెల్యేలు ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడు లేని రీతిలో బుధ‌వారం నుంచి గురువారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ వ‌రుస పెట్టి ప్రోగ్రామ్స్ ను పెట్టుకున్న‌ట్లుగా తెలుస్తోంది. కొంత‌మంది ఎమ్మెల్యేలు అయితే ఈ రోజు (గురువారం) ఉద‌యం ఆరు గంట‌ల నుంచే త‌మ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో కార్య‌క్ర‌మాల్ని షురూ చేసుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ ముంద‌స్తు ఏమో కానీ.. పార్టీల‌కు అతీతంగా ఎమ్మెల్యేల‌ను ఉద‌యం ఆరు గంట‌ల నుంచే ఉరుకులు ప‌రుగులు పెట్టించిన ఘ‌నత కేసీఆర్ సొంత‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.