Begin typing your search above and press return to search.

జంపింగ్ ఎమ్మెల్యేలు ఓటేయ‌కున్నా గెల‌వ‌నున్న టీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు

By:  Tupaki Desk   |   12 March 2019 9:00 AM GMT
జంపింగ్ ఎమ్మెల్యేలు ఓటేయ‌కున్నా గెల‌వ‌నున్న టీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు
X
తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో జ‌రుగుతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు మొద‌లై నాలుగు గంట‌ల వ‌ర‌కూ సాగింది. అసెంబ్లీ క‌మిటీ హాల్ 1లో జ‌రిగిన పోలింగ్ లో మొద‌టి ఓటును అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి వేయ‌గా.. రెండో ఓటును తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం ఓటు వేశారు. మొత్తం 91 మంది టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు.. ఏడుగురు మ‌జ్లిస్ ఎమ్మెల్యేలు ఓటేశారు. నిజానికి టీఆర్ ఎస్ కు ముగ్గురు ఎమ్మెల్సీల‌కు.. మ‌జ్లిస్ కు ఒక ఎమ్మెల్సీ గెలిచేందుకు అవ‌స‌ర‌మైన మెజార్టీ మాత్ర‌మే ఉంది. అయితే.. ఐదో స్థానాన్ని కూడా త‌మ సొంతం చేసుకోవ‌టానికి వీలుగా సీఎం కేసీఆర్ త‌న అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపారు. ఈ తీరును కాంగ్రెస్ వ్య‌తిరేకించింది. అయిన‌ప్ప‌టికీ.. త‌మ‌కు చెంద‌ని స్థానాన్ని త‌మ ఖాతాలో వేసుకునే విష‌యంలో కేసీఆర్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

త‌న వ్యూహాన్ని నెగ్గించుకోవ‌టానికి వీలుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేల‌తో పాటు.. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర‌ను త‌మ‌కు అనుకూలంగా ఓటు వేసేలా పావులు క‌దిపారు. అయితే.. త‌మ అభ్య‌ర్థికి కాకుండా.. టీఆర్ ఎస్ అభ్య‌ర్థికి ఓటు వేసేలా కేసీఆర్ సెట్ చేసిన వ్యూహం అమ‌లైతే.. త‌మ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు ప‌డ‌టం త‌ర్వాత‌.. పార్టీ ప‌రువు పోతుంద‌న్న విష‌యాన్ని కాంగ్రెస్ గుర్తించింది.

అందుకే.. కేసీఆర్ తీరును త‌ప్పు ప‌డుతూ.. తాము ఎన్నిక‌ల్ని బ‌హిష్క‌రిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. అదే స‌మ‌యంలో త‌మ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ‌రూ ఓటు వేయొద్ద‌ని విప్ జారీ చేసింది. టీడీపీ కూడా ఇదే నిర్ణ‌యం తీసుకుంది. దీంతో.. జంపింగ్ ఎమ్మెల్యేల‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌వేళ‌.. ఓటు వేస్తే అన‌ర్హ‌త వేటు ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో త‌న వ్యూహాన్ని మార్చిన కేసీఆర్‌.. జంపింగ్ ఎమ్మెల్యేలను పోలింగ్ లో పాల్గొన‌కుండా ఉండాల‌ని సూచించారు.

ఎందుకంటే.. ప్ర‌ధ‌మ ప్రాధాన్య‌త ఓట్ల‌కు అవ‌స‌ర‌మైన ఓట్లు రాకున్నా.. రెండో ప్రాధాన్య‌త ఓట్ల కింద అభ్య‌ర్థి గెలుపున‌కు అవ‌స‌ర‌మైన ఓట్లురానున్న నేప‌థ్యంలో వారిని పోలింగ్ కు దూరంగా ఉండ‌మ‌న్న‌ట్లు చెబుతున్నారు.

దీంతో.. కాంగ్రెస్.. టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయ‌కున్నా టీఆర్ ఎస్ తాను బ‌రిలో ఉన్న అన్ని స్థానాల్ని కైవ‌శం చేసుకోనుంది. ఒక ర‌కంగా చెప్పాలంటే.. ఈ ఎన్నిక‌ల్లో అన్ని పార్టీలు గెలిచిన‌ట్లేన‌ని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ పోలింగ్ కు దూరంగా ఉండి ప‌రువు ద‌క్కించుకుంటే.. జంపింగ్ ఎమ్మెల్యేలు పోలింగ్ కు దూరంగా ఉండి అన‌ర్హ‌త వేటు నుంచి త‌ప్పించుకున్నారు. ఇక‌.. టీఆర్ ఎస్ అయితే.. తాము కోరుకున్న‌ట్లు అన్ని స్థానాలు త‌మ‌కు సొంతం చేసుకున్న ప‌రిస్థితి.