Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యేల్లో బీపీ పెంచేస్తున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   11 Jun 2017 7:20 AM GMT
ఆ ఎమ్మెల్యేల్లో బీపీ పెంచేస్తున్న కేసీఆర్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఊహించ‌ని ఎత్తుగ‌డ‌లు వేయ‌డంలో కేసీఆర్ దిట్ట‌. త‌న‌దైన శైలిలో పావులు క‌దిపే కేసీఆర్ అంత‌రంగం ఇప్పుడు పార్టీ వ‌ర్గాల్లో తెగ‌ ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్పుడున్న మంత్రివర్గంతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని, ఎన్నికలనాటికి ఎలక్షన్ కేబినెట్ వస్తుందని ముఖ్యమంత్రి సన్నిహితులను ఉటంకిస్తూ ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఎన్నికల కేబినెట్ విస్తరణలోనైనా తమకు స్థానం దొరుకుతుందేమోనని పలువురు తెరాస ఎమ్మెల్యేలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ మూడేళ్ల క్రితం ఏర్పడిన మంత్రివర్గంలో పెద్దగా మార్పులు లేకుండా కొనసాగిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను తొలగించి కడియం శ్రీహరికి ఆ స్థానమివ్వడం మినహా ఎలాంటి మార్పులూ లేవు. శాఖల్లో మార్పులు తప్ప మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగలేదు. సాధారణ ఎన్నికలకు ఇంకా 21 నెలల గడువుంది. ఇప్పుడున్న మంత్రివర్గంతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని, ఎన్నికలనాటికి ఎలక్షన్ కేబినెట్ వస్తుందని ముఖ్యమంత్రి సన్నిహితులు చెబుతున్నట్లు ప్ర‌చారం జరుగుతోంది. ఇందుకు ప‌లు కార‌ణాలను కూడా చెప్తున్నారు. ప్ర‌స్తుతం మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు విమర్శించేందుకు ఇదో అవకాశంగా మారుతుందని, ఆ అవకాశం ఇవ్వకుండా ఎలక్షన్ కేబినెట్‌ లో మహిళలకు అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే కొందరికి మంత్రి పదవులు లభిస్తాయనే అభిప్రాయం కలిగేట్టుగా ముఖ్యమంత్రి మూడేళ్ల క్రితం పలు సందర్భాల్లో మాట్లాడినా ఇప్పటి వరకు ఆశావాహుల కోరిక తీరలేదు. దీంతో స‌ద‌రు ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలంతా తీవ్ర‌మైన ఆతృతతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశంలో కేసీఆర్ ఉద్యోగ సంఘాల నాయకుల నుంచి ఒకరిని క్యాబినెట్‌ లోకి తీసుకుంటాను అని ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పగా, ఒకరు కాదు ఇద్దరినీ అని నాయకులు కోరారు. సరే అని ముఖ్యమంత్రి చెప్పారు. ఎమ్మెల్సీ స్వామిగౌడ్ - మహబూబ్‌ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ లు మంత్రివర్గంలో తమకు స్థానం ఖాయం అని భావించారు. స్వామిగౌడ్ మండలి చైర్మన్ అయ్యారు. ఎంపి జితెందర్‌ రెడ్డి వల్లనే తనకు మంత్రివర్గంలో స్థానం లభించలేదనే శ్రీనివాస్ గౌడ్ పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. కొప్పుల ఈశ్వర్ స్పీకర్ పదవి వద్దు మంత్రివర్గం చేరుతాను అని ఆసక్తి చూపించారు. తరువాత అవకాశం ఉంటుందని హామీ ఇచ్చినా చీఫ్‌విప్ పదవితోనే సరిపెట్టుకున్నారు. రసమయి బాలకిష‌న్‌కు సైతం మంత్రివర్గంలో చోటు అనే హామీ లభించింది.ఇలా జాబితాలో ఎంద‌రో ఉన్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రివ‌ర్గంలో బెర్తు కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ... సీఎం కేసీఆర్‌ మాత్రం మంత్రివర్గంలో మార్పులపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. పైగా ఏపీ మంత్రివర్గంలో మార్పులు చేసి తల నొప్పి కొని తెచ్చుకున్నారంటూ విలేఖరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. పార్టీలోని కొన్ని వ‌ర్గాలు మాత్రం మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ ఉండ‌క‌పోవ‌చ్చున‌నే చెప్తున్నారు. మంత్రివర్గంలో నిర్ణయాలు-పార్టీపరంగా నిర్ణయాలు- అభ్యర్థుల ఎంపిక అంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతుందని, ఓటర్లు సైతం కేసీఆర్‌ ను చూసే ఓటు వేస్తారని పార్టీ నేతలు నమ్ముతున్నారు. మూడేళ్ల నుంచి ఏ ఎన్నిక జరిగినా టీఆర్‌ ఎస్‌ కే ప్రజలు ఘన విజయం చేకూరుస్తున్నారు, ప్రభుత్వం తమ కోసం ఎలా పని చేస్తుందని ప్రజలు చూస్తారు అంతే తప్ప మంత్రివర్గం కూర్పు చేర్పులను బట్టి కాదని పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు ఆశగా ఎదురు చూస్తున్న సంగ‌తి నిజ‌మ‌ని గులాబీ వ‌ర్గాలు అంత‌ర్గత సంభాష‌ణ‌ల్లో చెప్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/